(Source: ECI/ABP News/ABP Majha)
Winning Minister 2023: మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Winning Minister 2023: తెలంగాణలో చాలా మంది మంత్రులు ఓడిపోయారు. ప్రజాబలం ఉండి పోల్ మేనేజ్‌మెంట్ చేసుకున్న వారు మాత్రం విజయం సాధించారు.
Winning Minister 2023: తెలంగాణలో కాంగ్రెస్ ధాటికి పోటీ చేసిన మంత్రులు చాలా మంది ఓటిమి బాటపట్టారు. జనాల్లో ఉంటూ భారీగా ఖర్చు పెట్టిన వాళ్లు విజయం సాధించారు. అలాంటి వారిలో మంత్రి మల్లారెడ్డి ఒకరైతే... సనత్‌నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి గెలుపొందారు.
మాస్ మల్లన్న
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది మంత్రులు ఓడిపోయినా మంత్రి మల్లారెడ్డి మాత్రం మరోసారి విజయం సాధించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన రెండోసారి విజయం సాధించారు. ఈసారి మల్లారెడ్డి తోటకూర వజ్రేశ్ యాదవ్‌పై విజయం సాధించారు. ఇక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా 2014లో టీడీపీ తరుఫున మొదటి సారి మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. 2014లో ఎంపీగా విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి బదులు మల్లారెడ్డికి టికెట్ ఇచ్చారు. మల్లారెడ్డి విజయం సాధించిన తర్వాత ఆయన మంత్రిగా కూడా పని చేశారు.
తలసాని హ్యాట్రిక్
సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హ్యాట్రిక్ సాధించారు. మొత్తంగా ఆయన ఆరు సార్లు విజయం సాధించారు. ఒక ఉపఎన్నికతోపాటు మూడుసార్లు సికింద్రాబాద్ నుంచి మూడు సార్లు సనత్ నగర్ నుంచి జయకేతనం ఎగరేశారు. 2014 వరకు తలసాని టీడీపీలో ఉండే వారు. మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. 2018లో విజయం సాధించి మరోసారి మంత్రి అయ్యారు. 2018లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్‌పై విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి తుల ఉమపై విజయం సాధించారు.
సబితా విజయం
మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఐదోసారి విజయం సాధించి సత్తా చాటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన సబితా ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు కారు గుర్తుపై పోటీ చేసి ఐదోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిపై భారీ విజయం నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డిపై ఆమె తొమ్మిదివేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.