Narayanpet ZP Chairperson: కాంగ్రెస్‌లో చేరిన నారాయణపేట జడ్పీ ఛైర్ పర్సన్, కండువా కప్పి స్వాగతం పలికిన రేవంత్
Narayanpet ZP Chairperson: నారాయణపేట జడ్పీ ఛైర్ పర్సన్ వనజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Narayanpet ZP Chairperson joins in Congress:
హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ మొదలయ్యాక సైతం నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి, హస్తం పార్టీ, బీజేపీలు సీటు ఇవ్వలేదని కేసీఆర్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నారాయణపేట జడ్పీ ఛైర్ పర్సన్ వనజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంలో పార్టీ కండువా కప్పి వనజను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వనజతో పాటు మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న చేరికలు..
బీఆర్ఎస్ సీట్ల కేటాయింపు తరువాత తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వలేదన్న కారణంగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అనుకున్నట్లుగానే తనకు, తన కుమారుడికి టికెట్ సాధించుకున్నారు. కొల్లాపూర్ టికెట్ విషయంలో పొసగక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం బీఆర్ఎస్ ను వీడి అప్పట్లోనే కాంగ్రెస్ లో చేరారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో జాయిన్ కావడం తెలిసిందే. వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అదే సమయంలో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, నాగర్ కర్నూల్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ సీటు రాలేదని పీజేఆర్ తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి మరోసారి కాంగ్రెస్ లో చేరారు.
నాగార్జున సాగర్ నుంచి చేరికలు..
సాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండేబోయిన రామూర్తి యాదవ్ చిన్న కుమారుడు గుండేబోయిన నగేష్ యాదవ్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు ఎంపీటీసీ అంబటి రామ్, ఇతర నాయకులు, కార్యకర్తల 500 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్ కుందూరు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
2 చోట్ల నుంచి రేవంత్ పోటీ..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. తన రెగ్యూలర్ స్థానం కొడంగల్ నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి సైతం రేవంత్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. కొడంగల్ స్థానానికి నవంబర్ 6న రేవంత్ నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు కామారెడ్డి స్థానానికి చివరిరోజైన నవంబర్ 10వ తేదీన నామినేషన్ దాఖలుచేసే ఛాన్స్ ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధారామయ్య సైతం అదే రోజు కామారెడ్డిలో పర్యటించి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారని సమాచారం. నేడు 60 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ కీలక నేతలు పార్టీ బీ ఫారాలు అందజేశారు.