KCR in the Field : క్షేత్ర స్థాయిలోకి కేసీఆర్ - ఉద్యమస్థాయిలో ప్రజల్లో కదలిక తేగలరా ?
Telangana Politics : ఉద్యమ కేసీఆర్ ను చూపిస్తానన్న కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ స్థాయి చూపించి ఇప్పుడు పార్టీకి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించగలరా ?
Telangana CM KCR is going to the public through bus Yatra : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. బస్సుయాత్రలో పదేళ్ల బిఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ, ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బిఆర్‌ఎస్ సిద్ధం చేస్తోంది. ప్రజల్ని మళ్లీ ఉద్యమ స్థాయిలో సిద్ధం చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.
మళ్లీ ఉద్యమ కేసీఆర్ ను చూపిస్తానని కేసీఆర్ ప్రకటన
కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మిగిలిన పార్టీల అధినేతలు పాల్గొన్నట్లే బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో కేసీయార్ కూడా పాల్గొనటం సహజమే. కాని ఇపుడు కేసీయార్ బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రజల్ని దగ్గరకు చేసుకోవాలని.. వారి దగ్గరకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం అని కాకుండా ఎండిన పంటలను చూసేందుకు పొల్లాల్లోకి వెళుతున్నారు. ఎక్కడ కనబడితే అక్కడ రైతులతో రోడ్లపైన, పొలాల్లోకి వెళ్ళి మరీ మాట్లాడుతున్నారు. నామినేషన్లు మొదలైన తర్వాత అంటే 22వ తేదీనుండి ఉదయం 11 గంటల వరకు పొలంబాటతో బిజీగా ఉండబోతున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని సాయంత్రం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు లేదా మూడు చోట్ల రోడ్డుషోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొనబోతున్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ వరంగల్లో నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు.
రాజకీయాలు చేయాలంటే రాజీనామా చేయాల్సిందే - వైసీపీకి సలహాదారుల సమస్య !
ఉద్యమ సమయంలోనూ ఇంతగా పర్యటించని కేసీఆర్
కేసీఆర్ స్టైల్ రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఉద్యమ సమయంలో కూడా తెరపైకి రాలేదు. ఆయన ప్రకటిస్తారు.. మిగతా వారు ఆచరిస్తారు.. అంతే. ఆమరణ నిరాహారదీక్ష చేశారు.. ఆ తర్వాత ఆయన ఇంటి నుంచే ఉద్యమం నడిపారు. కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆరు బయటే స్నానాలు చేసేవారు. అలాంటి ఉద్యమ కేసీఆర్ ఇప్పుడు మళ్లీ వస్తున్నారని అనుకోవచ్చు. కానీ.. ఉద్యమం ఊపందుకున్న తర్వాత మాత్రం తెరపైకి వచ్చింది తక్కువ. ఇక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇక అవసరం లేకపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో మాత్రమే పాల్గొనేవారు. ఆయనను కలవడం కష్టంగా ఉండేదని అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. మంత్రులు, ఎంఎల్ఏల పరిస్ధితే ఇలాగుంటే ఇక మామూలు జనాలను పట్టించుకున్న పాపానపోలేదు. తాను జనాలను కలవదలుచుకున్నపుడు మాత్రమే కేసీయార్ పర్యటనలు చేసేవారు. అంతేకాని జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పర్యటించింది చాలా తక్కువ.
బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితే కారణం !
విపత్తుల సమయంలో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్, మాజీమంత్రులు కేటీయార్, హరీష్ రావులే పరామర్శించేవారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పత్తిరైతులు గిట్టబాటు ధరలకోసం ఆందోళనచేస్తే ఎవరూ పట్టించుకోలేదు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ సహా అనేక అంశాల్లో ప్రజల ఆందోళనలను ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే ప్రతిపక్షంలోకి వెళ్లడంతో కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం బయలుదేరుతున్నారు. బహింగసభల వల్ల ప్రయోజనం ఉండదని నేరుగా ప్రజల్ని కలవాలని అనుకుంటున్నారు. ఒకే ఒక్క ఓటమి బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకం చేస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై జనాల్లో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే పదేళ్ళు అధికారం అనుభవించిన చాలామంది నేతలు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. మరికొందరు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి చేరుకున్నారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
కేసీఆర్ మళ్లీ ప్రజల్లో బీఆర్ఎస్ పై ఆసక్తి పెంచగలరా ?
పార్లమెంటు ఎన్నికల్లో గనుక ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్ధులను జనాలు పట్టించుకుంటున్నట్లు లేదు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్-బీజేపీ మధ్యే అనే ప్రచారం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్ధులు కూడా ప్రచారంకూడా అంతంతమాత్రంగానే సాగుతోంది. క్యాడర్ సహకారం లేకపోవడంతో అభ్యర్థులు నిమిత్త మాత్రులుగా మగిలిపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ తన మాటలతో పార్టీని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. మరి ప్రతీ సారి మ్యాజిక్ రిపీట్ చేయగలరా ?