Congress Screening Committee: నేడు మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ-AICCకి అభ్యర్థుల జాబితా పంపే అవకాశం
తెలంగాణ కాంగ్రెస్‌లో అభ్యర్థుల కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. అభ్యర్థుల జాబితాను ఈరోజే ఏఐసీసీకి పంపే అవకాశం ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు.
అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్టారీ. వీలైంత త్వరగా క్యాండిడేట్లను ప్రకటించాలని భావిస్తోంది. అయితే... ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... తీవ్రంగా కసరత్తు చేయాల్సి వస్తోంది. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమెల్యే అభ్యర్ధులను ఎంపిక చేయాలని స్క్రీనింగ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ నిర్దేశించినట్టు కాకుండా బీసీలకు, మహిళలకు అత్యధిక సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంది స్క్రీనింగ్ కమిటీ. తెలంగాణ కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. పీఈసీ షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తోంది. ఇవాళ గాంధీ భవన్‌లో స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానుంది. నియోజకవర్గాల వారిగా ఇప్పటికే మూడు పేర్లను ఖరారు చేయగా...ఇవాళ పేర్ల ఖరారుపై తుది కసరత్తు జరగనుంది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులతో పాటు ఏఐసీసీ కార్యదర్శలను అభిప్రాయాలను స్వీకరించిన స్క్రీనింగ్ కమిటి అభ్యర్ధుల ఎంపికలపై నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి మూడు పేర్లను సూచిస్తూ సీల్డ్ కవర్‌లో నివేదికను ఢిల్లీకి పంపనున్నారు.
గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్.. కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. మొదటి రోజు ఒక్కో పీఈసీ సభ్యుడితో ముఖాముఖి నిర్వహించారు. అభ్యర్థులు ఎంపికకు తీసుకున్న ప్రాధాన్యతలు, అభ్యర్థులకు మార్కు పెట్టడాన్ని గత కారణాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమై.. తమ అభిప్రాయాలు చెప్పారు. నిన్న రెండో రోజు డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇవాళ మూడో రోజు.. మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.హైదరాబాద్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నేటితో ముగుస్తాయి. పీఈసీ షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చిన జాబితాను పరిశీలించి... సభ్యుల సూచనల ప్రకారం లిస్ట్ తయారు చేస్తోంది స్క్రీనింగ్ కమిటీ. ఈ లిప్ట్ దాదాపు ఫైనల్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.
దరఖాస్తులు చేసుకున్న వారి జాబితా నుంచి.. ప్రాథమికంగా నిర్ణయించిన ఆ అభ్యర్థుల జాబితాను ఇవాళ AICCకి పంపే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. ఈనెల 16న హైదరాబాద్ వేదికగా నిర్వహించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. CWC సమావేశ వేదికను ఖరారు చేయనున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వంటి చాలామంది జాతీయ నేతలు CWC సమావేశాలకు రానున్నారు. సెప్టెంబర్ 17న భారీ సభ జరగనుంది. ఈ సభలో పలు కీలక హామీలు ఇవ్వనున్నారు. ఈ హామీలతో ప్రజలని ఆకట్టుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.