BRS Ap Chief News : ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎక్కడ ? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని తోట చంద్రశేఖర్
Andhra Pradesh News: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఎక్కడున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో ఎక్కడా కనిపించడం లేదు.
AP President Thota Chandrasekhar: తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP)అగ్రనేతలు వరుసగా ర్యాలీలు, సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. విరామం లేకుండా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో సీమంధ్ర ప్రభావం ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో సెటిలర్లు ఎవరివైపు మొగ్గు చూపితే, ఆ పార్టీనే అధికారంలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఎక్కడ ? అన్న చర్చ మొదలైంది. తెలంగాణలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకముందే ఏపీ శాఖకు అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ (Thota chandrasekhar)ను నియమించింది బీఆర్‌ఎస్. అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, విశాఖ స్టీల్ ప్రైవేటుపరం కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఘనంగా ప్రకటించారు. ఆ తరువాత ఏపీలోని బీఆర్ఎస్ శాఖ అసలు ఉందో లేదో తెలియనంతగా సైలెంట్ అయిపోయింది.
తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఎక్కడున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయాల్సిన తోట చంద్రశేఖర్, ప్రచారాల్లో ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీకి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర జాతీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర రాష్ట్రాల నేతలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో తెలంగాణలో పార్టీకి అండగా నిలవాల్సిన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఏమయ్యారు ? ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదు ? అసలు ఆయన పార్టీలో ఉన్నారా ? లేదా ? ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఎందుకు ప్రచారం చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ కారణంగానే ఎన్నికల ప్రచారానికి పార్టీ ఆయన్ను ఉపయోగించుకోలేదా ? తోట చంద్రశేఖర్ ను పార్టీని ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ సేవలు వినియోగించుకుంటే మంచిదన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో ఉంది.
భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్ ఆ పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి పరాజయం పాలయ్యారు. 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయనను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా అధినేత కేసీఆర్ ప్రకటించారు.