అక్టోబరులోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ - మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించేందుకు రెడీ అవుతోంది. అక్టోబరు మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్...2018లో ఏడాది ముందుగానే అసెంబ్లీను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. 2018 అక్టోబరు 6న షెడ్యూల్, డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు కూడా జనవరిలోనే ముగియనుంది. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం డిసెంబరు 17తో ముగియనుంది.
అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రభుత్వ సెలవులతోపాటు స్థానిక పండగల సెలవులపైనా కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. అక్టోబరు, నవంబరు నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండగలు ఉన్నాయ్. ఈ పండుగలను తెలంగాణలో అత్యంతవైభవంగా నిర్వహిస్తారు. ఇవి తప్పా వేరే సెలవులు లేవు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో కేంద్ర ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి బృందం రెండు దఫాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. షెడ్యూల్ ప్రకటించటానికి ముందు ఒకసారి... నామినేషన్ల గడువు ముగిసిన తరవాత ఈ పర్యటనలు చేస్తుంది. ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం...ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది. నవంబరు 4న తుది ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు.
డిసెంబరులోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిసెంబరు 10లోపు పోలింగ్ ను పూర్తి చేసి...వారం రోజుల్లోనే కౌంటింగ్ నిర్వహించేలా కసరత్తు చేసింది. ఎన్నికల పరిశీలకులను నియమించేందుకు అధికారుల గుర్తింపు ప్రక్రియను షురూ చేసింది. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించనుంది. అక్టోబరులో రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎన్నికల నిర్వహణపై సమీక్షించనుంది. మరోవైపు బీఆర్ఎస్ అధిపతి కేసీఆర్...ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆశావహులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీజేపీ మాత్రం అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమైంది.