హైదరాబాద్‌లో అభివృద్ధి రజినీకాంత్ కు అర్థమైంది, ప్రతిపక్ష గజినీలకు అర్థం కాలేదు : మంత్రి కేటీఆర్
KTR Hot Comments: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్ కు అర్థమైందని, ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థం కాలేదన్నారు.
KTR Campaign In Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(Brs Working President), తెలంగాణ మున్సిపల్ ఐటీ వ్యవహారాల మంత్రి కేటీఆర్ (Ktr) ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ (Hyderabad)అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్(Rajinikanth)కు అర్థమైందని, ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థం కాలేదన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చిన రజినీకాంత్ అభివృద్ధిని ఆశ్చర్యపోయారు. నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, భారీ భవనాలు చూసి అనుమానం కలిగిందని, ఇది హైదరాబాదేనా లేదంటే అమెరికాలోని న్యూయార్కా ? అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజినీలకు మాత్రం హైదరాబాద్ అభివృద్ధి అర్థం కావడం లేదని కేటీఆర్ విమర్శించారు.
ఎటువైపు వెళ్లినా మెట్రో, ఫ్లై ఓవర్లు
కేపీహెచ్‌బీ నుంచి ఎటువైపు పోయినా మెట్రో, ఫ్లై ఓవర్లు, సవ్యమైన రోడ్లు కనిపిస్తాయన్నారు మంత్రి కేటీఆర్. 24 గంటల కరెంట్, మంచినీళ్లు అందిస్తున్నామన్న ఆయన, బ్రహ్మాండమైన వసతులు, అర్ధరాత్రి కూడా ఒంటరిగా వెళ్లే శాంతి భద్రతలు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ ప్రతి ఒక్కరికి ఒక అమ్మలాగా అన్నం పెడుతూ, కడుపులో పెట్టుకుని చూసుకుంటోందన్నారు. ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం మీ కండ్ల ముందే కనిపిస్తున్నాయన్న ఆయన, ఎవరో వచ్చి ఏదో చెప్తే కన్ఫ్యూజన్ కావొద్దని కూకట్ పల్లి ప్రజలకు సూచించారు.
పది లక్షల ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్‌లో ఇలా ఉంటేన మన బతుకులు బాగుంటాయన్న కేటీఆర్, ఐటీ కంపెనీలు విస్తృతంగా వస్తేనే ప్రజల బతుకులు బాగుంటాయన్నారు. ఐటీ కంపెనీల్లో వచ్చే ఒక్కో ఉద్యోగం పరోక్షంగా నాలుగు ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. క్యాబ్ డ్రైవర్లకు, స్విగ్గీ, జోమాటో డెలివరీ బాయ్స్‌కు, కార్మికులకు అలా పరోక్షంగా వీరందరికీ పని దొరుకుతోందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు ఐటీ ఉద్యోగాలు 3 లక్షల 23 వేలు ఉంటే, ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలో 10 లక్షల ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేశారు. ఒక వైపు రియల్ ఎస్టేట్ నిర్మారణ రంగం విస్తరిస్తోందన్న కేటీఆర్, ఒక్కో రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
అంతకు ముందు వికారాబాద్ లో ప్రచారం
అంతకుముందు వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. అతి స్వల్పకాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తమకు దొరికింది ఆరున్నరేళ్లేనని, ఈ ఆరున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. మర్పల్లి, బంట్వారం ప్రజలు 2014కు ముందు మీ జిల్లా ఎలా ఉండేదో ఆలోచించాలన్న కేటీఆర్, వికారాబాద్ జిల్లాను సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాదు రేటెంతరెడ్డిగా మారిపోయారన్న ఆయన, రూ.50 లక్షలతో దొరికిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారని విమర్శించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ వాళ్లు వచ్చి వరసలు కలుపుతున్నారని మండిపడ్డారు. గతంలో రూ.200 పింఛను ఇవ్వనోళ్లు ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా ? అని ప్రశ్నించారు.