Telangana BJP : చేరికల్లేకపోగా జంపింగులు - తెలంగాణ బీజేపీ సన్నాహాలు దారి తప్పాయా ?
ఎన్నికలకు సిద్ధమయ్యే విషయంలో తెలంగాణ బీజేపీ తడబడుతోంది. నోటిఫికేషన్ వచ్చే సమయానికి అభ్యర్థుల్ని ఖరారు చేయడం కూడా కష్టంగా మారుతోంది.
Telangana BJP : తెలంగాణ బీజేపీ గడ్డు పరిస్థితుల్లో పడిపోయింది. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని నమ్మి ఆ పార్టీలో చేరిన వారంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఉన్నవారి మీద అదే పనిగా పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అనేక మంది ఇలా వలస వచ్చిన సీనియర్లు తాము పోటీ చేసేది లేదని చెబుతూండటంతో హైకమాండ్ కు కూడా ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అతి కష్టం మీద మొదటి జాబితా ప్రకటించారు. రెండో జాబితాలో ప్రకటించడానికి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ జాబితా కూడా ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి వచ్చే అసంతృప్తులకు టిక్కెట్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది. బీజేపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది...?
చేరికల సునామీ లేకపోగా రివర్స్ వలసలు!
దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ ఎన్నికల్లో విజయాల తర్వాత బీజేపీకి వచ్చిన ఊపు చూస్తే ఇక కాంగ్రెస్ లెక్కలో లేదని ఎక్కువ మంది అనుకున్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు జరుగుతుందని అనుకున్నారు. కానీ గట్టిగా ఆరు నెలలు అయ్యే సరి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పార్టీలో చేరిన నేతలంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. పార్టీలో చేరేవారు లేకపోగా.. వెళ్లిపోయే వారు ఎక్కువగాఉన్నారు. చేర్చుకున్న వారిని అట్టి పెట్టుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమయింది. స్వామిగౌడ్, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, రాపోలు ఆనందభాస్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎర్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుష్పలీల, నాగం జనార్ధన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇలా అనేక మంది నేతలు చేరారు. వెళ్లిపోయారు.
పోటీకి దూరంగా పార్టీని ఇంకా వీడని సీనియర్లు
రాజగోపాల్‌రెడ్డి బాటలోనే మరికొంత మంది సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు అదే పనిగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వర్సెన్ టీఆర్‌ఎస్ అనే మూడ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఘోరంగా ఓడిపోతే ఉన్న పరువు కాస్తా ఎక్కడ పోతుందో అనే భయంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే జంకుతున్నారు. ఈ జాబితాలో డీకే అరుణ, వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి తదితర కీలక నేతలంతా ఉన్నారు. మరి కొందరు కీలక నేతలు పార్టీని కూడా వీడబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. వీరంతా ఎప్పటికప్పుడు తాము పార్టీ మారడం లేదని ఖండిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు.. ఎంత నిజాయితీగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
ద్వితీయ శ్రేణి వలస నేతలకు టిక్కెట్లు ఇవ్వడంతో మరితం రచ్చ !
పార్టీలో చేరిన సీనియర్లు .. పార్టీకి రాజీనామా చేయడమో.. సైలెంట్ గా ఉండటమో చేస్తున్నారు. పార్టీలో చేరిన ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం టిక్కెట్లు ఇస్తున్నారు. దీంతో పార్టీ కోసం పని చేసిన వారు రాజీనామా బాట పడుతున్నారు. వేముల వాడ టిక్కెట్ కోసం ఈటలతో పాటు పార్టీలో చేరిన తుల ఉమ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు పోటీ పడుతున్నారు. పలుకుబడి ప్రకారం చూస్తే వికాస్ రావుకే చాన్స్ వస్తుంది. మరి ఈటల ఊరుకుంటారా ? తుల ఉమ సర్దుకోకుండా ఉంటారా? పార్టీ కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తున్నా తమకు సీట్లు ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన డబ్బున్నవాళ్లకే సీట్లు కేటాయిస్తుండటంపై ఆ పార్టీ హార్డ్‌కోర్ నాయకులు గుస్సా అవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరందరికీ సర్ది చెప్పలేక బీజేపీ పెద్దలు తంటాలు పడుతున్నారు.
ఓ వైపు బలమైన అభ్యర్థులు లేక ఇబ్బందులు పడుతూంటే.. మరో వైపు ఉన్న నేతల అసంతృప్తి గుక్క తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఎలా చూసినా బీజేపీ ఎన్నికల సన్నాహాలు పూర్తి స్థాయిలో వెనుకబడిపోయాయని ఆ పార్టీ నేతలే గొణుక్కుంటున్నారు.