మొన్న చెవిరెడ్డి, నిన్న రోజా, తాజాగా బాలినేని ప్రణీత్ రెడ్డి పేర్లు-ఒంగోలు పార్లమెంట్ పై వీడని పీటముడి
Ongole News: ఒంగోలు పార్లమెంటు స్థానంలో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్దిగా రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో...వైసీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
Ongole Parliament Candidate News: ప్రకాశం (Prakasam)జిల్లా ఒంగోలు పార్లమెంటు స్థానంలో...వైసీపీ (YCP) తరఫున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్దిగా రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో...వైసీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మొన్న రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతచెరువు సత్యనారాయణరెడ్డి (Satyanarayana Reddy )... నిన్న చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy ), మంత్రి రోజా (Roja) పేరు కూడా వచ్చింది. ఇపుడు తన కుమారుడు ప్రణీత్ రెడ్డి ( Praneeth Reddy )పేరును ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) తెరపైకి తీసుకొచ్చారు.
ఒంగోలు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి...సీటు విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత రాకపోవటంలో వైసీపీలో అయోమయం నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రాజకీయ ఆరంగ్రేటం చేయించాలని భావించారు శ్రీనివాసులరెడ్డి. అయితే కాలం కలసి రాలేదు. మాగుంట ఎంపీగా...తాను ఒంగోలు ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతూ వస్తున్నారు. తమ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని పలుమార్లు ప్రకటించారు.
ఒంగోలు పార్లమెంట్ స్థానానికి...చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును వైసీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీపై జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు విముఖత వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి బాలినేని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా వాసులకే ఎంపీ సీటు ఇవ్వాలని సూచించారు. జిల్లాకు చెందిన రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతచెరువు సత్యనారాయణరెడ్డి పేరును ప్రతిపాదించారు. ఆయన మొగ్గు చూపకపోతే తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని పోటీ చేయించేందుకు సిద్దంగా ఉన్నామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సీఎం జగన్‌కు చెప్పారు. ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో బాలినేని, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ కావటం చర్చ నీయాంశంగా మారింది. మాగుంట విషయంలో పున:సమీక్షించాలని సీఎం జగన్‌ను కోరాలని అనుకున్నారు.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పేరును పరిశీలిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం...ఐ ప్యాక్ ద్వారా సంకేతాలను పంపింది. జిల్లాలో బాలినేని సహా ముఖ్య నేతలకు సమాచారం అందించారు. ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇవ్వడం సాధ్యపడక పోవచ్చని...మంత్రి రోజా పేరును తెర మీదకు తీసుకు వచ్చారు. ఇటీవల ఆమె సొంత నియోజజకవర్గం నగరిలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఆమెపై పెరుగుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో తిరిగి అక్కడి నుంచే పోటీ చేయిస్తే ఇబ్బందులు ఎదురు కావచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు నుంచి ఆమెను పోటీ చేయిస్తే రెడ్డి క్యాస్ట్ ఈక్వేషన్ కూడా కలిసి వస్తుందని...రెడ్డిని తప్పించి మరొకరికి సీటు ఇచ్చారన్న వ్యతిరేకత నుంచి బయట పడవచ్చని వైసీపీ భావిస్తోంది. వైసీపీ అధిష్టానం ప్రతిపాదనపై జిల్లా వైసీపీ ముఖ్య నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాలకు గుంటూరు జిల్లాకు చెందిన నేతలను తీసుకు వచ్చారని పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎంపీ అభ్యర్థిని కూడా ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులను తీసుకువస్తే...పార్టీ శ్రేణల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా ఆర్కే రోజాను ఫైనల్ చేస్తారా..? లేదంటే బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డికి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇపుడు ప్రణీత్ రెడ్డికి సీటు ఇస్తే...పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేల గెలుపు బాధ్యతలను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల సంగతి తనకు వదిలివేయాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైకమాండ్ కు చెప్పినట్లు తెలుస్తోంది.