revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
People Government in Telangana : తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో పాలకులు ఉండరని సేవకులే ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.
Revanth reddy oath taking Speech : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత గవర్నర్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లిపోయిన తర్వాత కృతజ్ఞతా సభ నిర్వహించారు. 'జై సోనియమ్మ' అంటూ సీఎంగా రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దశాబ్ద కాలంగా తెలంగాణలో మానవ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
రెండో సంతకంగా వికలాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. తెలంగాణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. ప్రజలు ఎప్పుడైనా ప్రజాభవన్ కు రావొచ్చని, ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని స్పష్టం చేశారు. ప్రజా భవన్ వద్ద కంచెలను ఇప్పటికే తొలగించామన్నారు.
పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసిందని రేవంత్ గుర్తు చేసుకున్నారు. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని .. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనిందన్నారు. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని ప్రకటించారు.
ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం.. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తామన్నారు. మేం పాలకులం కాదు.. మేం సేవకులమని.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటానని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిశై సౌందర రాజన్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన కర్యక్రమంలో ప్రమాణం చేయించారు. రేవంత్ అనే నేను అని .. పలకగానే స్టేడియం హోరెత్తిపోయింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలందరూ తరలి వచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇతర నేతలు కూడా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యమైన నేతలందరూ తరలి రావడంతో హైదరాబాద్ మొత్తం సందడిగా మారింది.