(Source: ECI/ABP News/ABP Majha)
Returning Officers Leave : తీవ్ర ఒత్తిడిలో రిటర్నింగ్ ఆఫీసర్లు - సెలవుపై వెళ్లిన తాడిపత్రి ఆర్వో
Andhra News : ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు సెలవులు కోరుతున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నామని సిక్ లీవు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది.
Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థాయిలో ఎన్నికల పోరాటం జరిగిందో ఘర్షణలే నిరూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పలు నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రెండు వైపుల నుంచి అభ్యర్థులు ఇబ్బంది పెడుతూండటంతో తమకు ఈ బాధ్యతలు వద్దని ఎన్నికల సంఘానికి నివేదించుకుంటున్నారు. రాయలసీమలోని దాదాపుగా పదిహేను నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి సెలవుల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాము అండగా ఉంటామని నిర్భయంగా విధులు నిర్వహించాలని ఈసీ సూచిస్తోంది. కానీ కొంత మంది మాత్రం తట్టుకోలేక సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు.
సెలవుపై వెళ్లిన తాడిపత్రి రిటర్నింగ్ ఆఫీసర్
తాడిపత్రి రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయంలో ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉండటంతో తనను ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలని రాంభూపాల్ రెడ్డి ఇదివరకే ఉన్నతాధికారులను కోరారు. కౌంటింగ్ వరకు కొనసాగాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే, తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఆయన మరోసారి సెలవు కోసం విజ్ఞప్తి చేయడంతో అధికారులు అనుమతించక తప్పలేదు. రాంభూపాల్ రెడ్డి స్థానంలో ఇతర అధికారికి బాధ్యతలు అప్పగించ ేఅకవాశం ఉంది.
తాడిపత్రిలో ఎలాంటి ఫలితం వచ్చినా గొడవలు ఖాయమని ఆందోళన
తాడిపత్రిలో ఎలాంటి పలితం వచ్చినా రావణకాష్టం జరుగుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర్నుంచి కౌంటింగ్ వరకూ ప్రతీ విషయం వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. అభ్యర్తులు ఇద్దరూ ఎవరికి వారు తగ్గని నేతలుగా పేరు తెచ్చుకున్నారు. ఫ్యాక్షన్ ప్రభావమూ ఎక్కువగా ఉంది. పోలింగ్ రోజు పోలీసులు కంట్రోల్ చేసినా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కౌంటింగ్ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టంగా మారింది.
తాడిపత్రిలో భారీగా బలగాలు
తాడిపత్రిలో ఎవరు గెలిచినా..ఎవరు ఓడిపోయినా.. రాష్ట్రంలో ప్రభత్వం మారినా మారకపోయినా.. గొడవలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తాడిపత్రిని అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన ఈసీ కేంద్ర బలగాలను పంపింది. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రత చోటా బలగాలను మోహరించింది. ఫలితాలు వచ్చిన రెండు వారాల వరకూ భద్రత ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారులే చూసుకోవాల్సి ఉంటుంది. కఠినంగా వ్యవహరిస్తే తర్వాత అధికారంలోకి వచ్చే వారు వేధిస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో ఆర్వోలు ఎందుకైనా మంచిదని సెలవులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.