Telangana Congress: కాంగ్రెస్‌కు చావో రేవో- అధికారమే లక్ష్యంగా పావులు- వచ్చే నెలలో మ్యానిఫెస్టో
Telangana Congress: మూడే మూడు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌కు చావో రేవో. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే రాష్ట్రంలో హస్తం గుర్తు ఉనికిలో ఉంటుంది.
Telangana Congress: మూడే మూడు నెలలు. తెలంగాణ కాంగ్రెస్‌కు చావో రేవో. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే రాష్ట్రంలో హస్తం గుర్తు ఉనికిలో ఉంటుంది. లేకపోతే తెలంగాణ రాష్టంగా ఇచ్చిట్లు చెప్పకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదంలో ఉంది. అందుకే ఎలాగైనా అధికారాన్ని దక్కించుకునేందుకు టి.కాంగ్రెస్ శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. వరసగా హామీలు గుమ్మరిస్తోంది. కర్ణాటక తరహాలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తన కార్యాచరణను అమలు చేస్తోంది.
మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్‌లో పార్టీ మేనిఫెస్టో ప్రకటించాలని యోచిస్తోంది. వివిధ వర్గాల ఓటర్లను వాగ్దానాలతో తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రైతులు, యువత, సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారులకు అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు)పై దృష్టిసారించింది. ఆయా కులాలకు తాము ఏం చేస్తామో చెప్పేందుకు తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా వివిధ వర్గాలకు మరింత ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది.
శనివారం చేవెళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇందుకు ఓ ఉదాహరణ. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దళిత బంధు పథకం కింద బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతేడాది ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించగా, కాంగ్రెస్ 2023-24 నుంచి ఐదేళ్లలోపు ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రయివేటు విద్యాసంస్థలు, ప్రయివేటు కంపెనీల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఎస్సీలకు రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతామని పార్టీ హామీ ఇచ్చింది. ఇళ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇందిరమ్మ పక్కా గృహాల పథకం కింద ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామని ఖర్గే ప్రకటించారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూములను బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని తిరిగి అర్హులకు హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. అర్హులైన లబ్దిదారులందరికీ పోడు భూములకు పట్టాలు అందించేందుకు అటవీ హక్కుల గుర్తింపు (ఆర్‌ఓఎఫ్‌ఆర్) చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొంది. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం (ఎస్‌జీజీపీ) ద్వారా ప్రతి తండా, గూడెం గ్రామపంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు మంజూరు కేటాయిస్తామంది.
ఓటర్లలో కీలకంగా ఉన్న రైతులు, యువత, నిరుద్యోగులకు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇచ్చింది. గత ఏడాది రైతుల కోసం పార్టీ డిక్లరేషన్‌ను విడుదల చేయగా, మేలో యువత మరియు నిరుద్యోగుల కోసం డిక్లరేషన్‌ను విడుదల చేసింది. గత ఏడాది మే 6న వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. అందులో రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు ఏటా రూ.15,000 ప్రత్యక్ష ప్రయోజనం వంటి వాగ్దానాలు ఉన్నాయి. అలాగే భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందించేందుకు 'ఇందిరమ్మ రైతు భరోసా' పథకాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది.
MGNREGA కింద నమోదైన భూమి లేని ప్రతి రైతు కూలీకి సంవత్సరానికి రూ.12,000 అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో రైతులు పండించే అన్ని పంటలను మెరుగైన కనీసపు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టాలను పూడ్చేందుకు మెరుగైన పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయ పనులను MGNREGA పథకంలో విలీనం చేస్తామని భరోసా కల్పించింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని, కొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ ఏడాది మే 9న హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ యువజన ఛార్టర్‌ను విడుదల చేశారు. నిరుద్యోగ భృతిగా రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని, వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌తో పాటు ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీల కోసం ప్రత్యేక డిక్లరేషన్, ప్రకటనలపై కసరత్తు చేస్తోంది.