PM Modi Tour: దక్షిణాదిలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు- వ్యూహం ఏమిటి?
సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించ నున్నారు. దీని వెనుక వ్యూహం ఉందా?
PM Modi Tour: ఊరకరారు మహానుభావులు-అన్నట్టుగా అగ్రనాయకులు ఒక రాష్ట్రానికి వచ్చారంటే చాలా ముందు వెనుక ఆలోచిస్తారు. పైగా.. `మీకిది-మాకది` అన్నట్టుగా మారిపోయిన రాజకీయాల్లో నాయకులు ఊరికేనే ఏమీ చేయరు. ఈ నేపథ్యంలో అత్యంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధానమంత్రి (Prime minister) నరేంద్ర మోడీ(Narendra Modi) సోమవారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనను పెట్టుకున్నారు. వరుసగా ఆయన మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ(Telangana), తమిళనాడు(Tamilnadu), ఒడిశా(Odisha) రాష్ట్రాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. దీని వెనుక చాలానే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో గత ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. అయితే, అనూహ్యంగా ఈ వ్యూహం సక్సెస్ కాలేదు. కానీ, అనుకున్నస్థాయి కంటే కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకుని.. బీజేపీ బలపడుతోందనే సంకేతాలు పంపించింది.
టార్గెట్ @ 10
ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం తెలంగాణ 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలోనూ ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి కీలకమైన లోక్ సభస్థానాలపై రాజకీయ పక్షాల దృష్టి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటన.. పైగా ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌లో 56 వేల కోట్ల రూపాయల అభివృద్ధిపనులకు శంకు స్థాపనలు వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసంలో కనీసం.. 17 స్థానాలకుగాను 10 చోట్ల అయినా విజయం దక్కించుకుని తీరాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న దరిమిలా.. ప్రధాని పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, ఆయన సోమవారం ఒక్కరోజుతోనే తన పర్యటనను ముగించుకోవడం లేదు. మంగళవారం మరోసారి తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు మళ్లీ శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రధాని పర్యటిస్తారు. ఇదంతా కూడా ఎన్నికల వ్యూహంలో భాగంగానే జరుగుతున్న పర్యటనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పుంజుకోవాలనేదే కీలకం
తమిళనాడులోనూ ఈ సారి.. బలమైన పక్షంగా బీజేపీ ఎదగాలని నిర్నయించుకుంది. ఈ రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 39 ఉన్నాయి. గత 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం దక్కించుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ బలంగా పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ప్రత్యేక దృష్టి పెట్టింది. ``కాశీ తమిళ సంగమం`` పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించి.. ఇక్కడి వారిని కాశీకి తీసుకువెళ్లి విశ్వనాథుని దర్శనం చేయించడంతోపాటు.. వారితో ప్రధాని మమేకమయ్యారు. ఇక, కొన్నాళ్ల కిందట ప్రధాని మోడీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మూడోసారి కూడా వారణాసినే ఎంచుకున్నారు. రేపు ఒకవేళ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బావిస్తే.. ఆల్టర్నేట్‌గా తమిళనాడునే ఎంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాని తమిళనాడు పర్యటనకు అత్యంత ప్రాధాన్యం పెరిగింది.
నవీన్ వీక్ అవుతుండడంతో
ఒడిశాలోనూ ప్రధాని పర్యటించనున్నారు. ఇక్కడ ఈ ఏడాది ఏపీతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగను న్నాయి. పైగా ఇక్కడ బీజేపీకి తెలంగాణలో మాదిరిగా బలమైనవాయిస్ వినిపించే నాయకులు కూడా ఉన్నారు. మరోవైపు.. అధికార బీజేడీలో నాయకత్వ పరిస్థితి డోలాయమానంలో ఉంది. సీఎం నవీన్ పట్నాయక్ వృద్ధుడు కావడం, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుండడం.. తమిళనాడుకు చెందిన ఓ ఐఏఎస్ అధికారినీ వీఆర్ ఎస్ తీసుకునేలా ప్రోత్సహించి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడం వంటి పరిణామాలు ఆసక్తిగా మారాయి. అయితే..దీనిని కొందరు జీర్నించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంగా ఆ గ్యాప్‌ను తమకు అనుకూలంగామార్చుకుని పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మేలు చేకూర్చుకునే వ్యూహంతో ప్రధాని ఇక్కడ పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారనేది పరిశీలకుల అంచనా. ఏదేమైనా.. మోడీ దక్షిణాది పర్యటనల వెనుక అతి పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు.