One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్లమెంటులోనే అసలు ఫైట్- ఏం జరుగుతుంది?
`ఒకే దేశం- ఒకే ఎన్నికలు` నినాదంతో జమిలికి కేంద్రం రెడీ అయింది. దీనికి సంబంధించిన బిల్లును కేబినెట్ ఓకే చేసింది. ఇక, ఇప్పుడు అసలు తంటా పార్లమెంటులోనే ఉండనుంది. ఇక్కడ ఓకే అవుతుందా? అనేది చర్చ!!

One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు నినాదాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Narendra modi) ప్రభుత్వం గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath Kovind) నేతృత్వంలో అధ్యయన కమిటీ(Committee)ని కూడా నియమించింది. దీనికి సంబంధించిన నివేదికను కోవింద్ కమిటీ ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. దేశవ్యాప్తంగా న్యాయ వర్గాలు.. రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ.. భారీ నివేదికను కేంద్రానికి అందించింది. ఇక, ఇప్పుడు కేంద్ర కేబినెట్(Cabinet) కూడా.. తాజాగా ఒకే దేశం-ఒకే ఎన్నికల బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టి.. ఆమోదించుకోవడం ద్వారా రాష్ట్రాల తీర్మానాల అనంతరం దీనిని చట్టం చేయనున్నారు. అనంతరం వచ్చే రెండేళ్లలో జమిలి ఎన్నికలకు రెడీ కావాలనేది కేంద్రంలో మోదీ సర్కారు యోచన. అయితే.. ఒకే దేశం-ఒకే ఎన్నికలను చట్టంగా మార్చే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరం. లోక్‌సభలో ఇబ్బంది లేకపోయినా.. రాజ్యసభలో మాత్రం ఇబ్బంది తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
అసలెందుకు?
జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదు. గతంలోనూ ఈ ప్రతిపాదన రావడం.. తెలిసిందే. వాస్తవానికి జమిలి ద్వారా.. ఎన్నికల ఖర్చు(Election expenditure)ను తగ్గించడం ఒక కారణమైతే.. దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కారణంగా.. అభివృద్ది(Development programes) కార్యక్రమాలకు విఘాతం ఏర్పడుతోందన్నది మరో కారణం. వీటికితోడు.. ఎన్నికల సమయం వృధా కాకుండా.. ప్రజలకు సేవలు మరింత చేయొచ్చన్నది కేంద్రం ఆలోచన. లోక్‌సభ(Lokshabha), రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ ద్వారా ఖర్చు తగ్గించడంతోపాటు.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఆలోచన ఉంది. ఈ క్రమంలోనే జమిలికి జైకొట్టాలన్నది కేంద్రం యోచన. దీనిపై అనేక సార్లు.. ప్రతిపాదనలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది.
ప్రస్తుత సమావేశాల్లోనే..
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి, న్యాయ కోవిదులు రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను దశలవారీగా నిర్వహించాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ మార్చి 14, 2024న నివేదికను సమర్పించగా, 2024 సెప్టెంబర్‌లో కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు, దాదాపు మూడు నెలల తర్వాత, ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో(Winter session of parliament)నే ఈ బిల్లు సభల ముందుకు రానుంది. కేంద్రంలో ముచ్చటగా మూడో సారి కొలువుదీరిన మోదీ ప్రభుత్వం.. జమిలి ఎన్నికల చట్టం చేసే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది చట్టంగా మారితే.. 2029 లేదా 2034 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
లోక్‌సభలో నెంబర్ గేమ్!
దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే దీనికి సంబంధించిన బిల్లుకు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ముందు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని చాలా పార్టీలు వ్యక్తం చేశాయి. అధికార కూటమికి లోక్‌సభలో 270 మంది ఎంపీలు ఉన్నారు. మద్దతివ్వని లేదా వ్యతిరేకించని ఎంపీల సంఖ్యను కలిపితే ఇది 293కి చేరుకుంది. దీనిలో టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఉండడం గమనార్హం. వారంతా సభలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపనున్నారు. అయితే.. లోక్‌సభలో మొత్తం సభ్యులు కనుక హాజరైతే.. రెండింట మూడు వంతుల మంది ఈ బిల్లుకు జై కొట్టాల్సి ఉంటుంది. అంటే.. 362 మంది ఓకే చెప్పాలి. అప్పుడు లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందకపోయే అవకాశం కూడా ఉంది.
రాజ్యసభలో మరింత కష్టం
రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజ్యసభ(Rajyasabha)లో 231 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 113 మంది ఎన్డీఏ(NDA), ఆరుగురు నామినేటెడ్(Nominated), ఇద్దరు స్వతంత్ర ఎంపీలు సహా 121 మంది సభ్యులు ఉన్నారు. మూడింట రెండు వంతుల మద్దతు కోసం 154 మంది సభ్యులు హాజరు కావాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 33 ఓట్లు తగ్గాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్(YSR congress party), భారత రాష్ట్ర సమితి(BRS) ఇతర స్వతంత్రులు కలిపి 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరు ఎన్డీయే కానీ, ఇండియా కూటమితో కానీ లేరు. ఇక ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి ప్రతిష్ఠంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే.. కపిల్ సిబల్ అనుకూలంగా ఓటు వేయవచ్చు. ఇక, ఏఐఏడీఎంకే(AIADMK)కు చెందిన నలుగురు ఎంపీలు, బీఎస్పీ(BSP)కి చెందిన ఒక ఎంపీ ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. వీరు కనుక ఎన్డీయే కు అనుకూలంగా మొగ్గు చూపితే.. కొంత వరకు ఫర్వాలేదు. లేక పోతే.. ఈ బిల్లును ఆమోదించుకునేందుకు కష్టపడాల్సి వస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

