Voter Registration: ఓటు నమోదుకు లాస్ట్ ఛాన్స్, రేపటితో ముగియనున్న గడువు
Andhra Pradesh Elections: ఈ నెల 15వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈలోగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించనుంది.
April 15 Last Day for Voter Registration: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే ముందుగా ఓటరు జాబితాలో పేరు ఉందో..? లేదో..? చూసుకోండి. ఒకవేళ ఓటు లేకపోతే మాత్రం ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇప్పటికీ మరో అవకాశం మిగిలే ఉంది. ఈ నెల 15వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈలోగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించనుంది. ఆ తరువాత నమోదు చేసుకునే వారికి మాత్రం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించదు. జిల్లాల్లో ఎన్నికల అధికారులు ఓటరు నమోదు కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వీలైనంత ఎక్కువ మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విచారించిన అనంతరం వారిని అనుబంధ ఓటర్ల జాబితాలో చేర్చనున్నట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఇంటి నుంచే నమోదు చేసుకోవచ్చు
ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి ఏ కార్యాలయానికి, అధికారి వద్దకో తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఇంటి వద్ద ఉంటూనే ఓటు నమోదు చేసుకోవచ్చు. కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్.. ఏది ఉన్నా క్షణాల్లోనే పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఓటు పొందవచ్చు. అందుకు అవసరమైన వివరాలను అందిస్తే సరిపోతుంది. ఓటు హక్కు పొందడానికి పూర్తి వివరాలు, ఫటో, పుట్టిన తేదీని నిర్ధారించే పత్రాలు, చిరునామా, ఆ చిరునామాలో ఉంటున్నట్టుగా నిర్ధారించే పత్రాలు(డిజిల్ ఫార్మాట్‌లో ఉండాలి) ఉంటే సరిపోతుంది. 2006 మార్చి 31లోపు జన్మించిన వారెవరైనా కొత్త ఓటు పొందేందుకు అర్హులుగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఫారం 6ను ఎంచుకోవాల్సి ఉంటుందని అధిఆరులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా వెబ్‌సైట్
ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల కమిషన్ అధీకృత వెబ్‌సైట్‌లోకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో https://voters.eci.gov.in టైప్ చేయాలి. వెబ్‌సైట్‌లో కుడివైపు పై భగంలో లాగిన్, సైన్ అప్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఖాతా లేకపోతే సైన్ అప్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఖాతాను సృష్టించుకున్న తరువాత లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్, క్యాప్సా కొట్టిన తరువాత ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫాం 6ను క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి. వివరాలు పూర్తి చేసే క్రమంలో పాస్‌పర్టు సైజ్ ఫొటో, పుట్టిన తేదీని నిర్ధారించే పత్రాలు, చిరునామా ధృవీకరణ పత్రాలు డిజిటల్ ఫార్మాట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో ఫైల్ సైజు 2 ఎంబీనీ మించకుండా చూసుకోవాలి.
దరఖాస్తులో అడిగిన వివరాలను పూర్తి చేస్తూ ముందుకు వెళితే సరిపోతుంది. మరోసారి పరిశీలించుకుని సబ్మిట్ కొడితే దరఖాస్తు నమోదు చేసుకున్నట్టే.. ఆ వెంటనే మీకు ఓ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మీ ఓటరు నమోదు ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఖాతాలోకి లాగిన్ అయిన తరువాత కుడివైపు పై భాగంలో ట్రాక్ అప్లికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వివరాలు పూర్తి చేసే దరఖాస్తు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. కాగా, అర్హులైన ఓటర్ల వివరాలతో ఈ నెల 25న అనుబంధ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.