PK And YSRCP : పీకే లేని ఐప్యాక్ మెప్పించలేకపోతోందా ? వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతల అసంతృప్తి నిజమేనా ?
ప్రశాంత్ కిషోర్ లేని ఐ పీఏసీ మెప్పించలేక పోతోందా ? వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారా ?
PK And YSRCP : ప్రశాంత్ కిషోర్ దేశంలో ఉన్న అగ్రశ్రేణి పొలిటికల్ స్ట్రాటజీస్టుల్లో ఒకరు. ఆయితే ఆయన తన ఇన్నింగ్స్ ను ముగించారు. సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. బీహార్ లో కొంత కాలం పాదయాత్ర చేశారు. తర్వాత కంటిన్యూ చేయనున్నారు. చివరి సారిగా ఆయన డీఎంకేకు పని చేశారు. ఆ తర్వతా మరే పార్టీకి పని చేసేది లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఇప్పటికీ ఆయన స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ యాక్టివ్ గా ఉంది. ఆయన సహచరులు ఐ ప్యాక్ ను నడుపుతున్నారు. కానీ పీకే పాత్ర మాత్రం లేదు. తాను ఇక మరే పార్టీకి పని చేయబోనని ఆయన చెబుతున్నారు. అయితే పీకే లేని ఐ ప్యాక్ మాత్రం ఇబ్బంది పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తెలంగాణలో ఐ ప్యాక్ ను వెంటనే దూరం పెట్టేసిన కేసీఆర్
ప్రశాంత్ కిషోర్ గతంలో కేసీఆర్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన సంస్థ ఐ ప్యాక్ తో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. కొంత కాలం కీలకంగా వ్యవహరించింది. ప్రశాంత్ కిషోర్ నాలుగైదు సార్లు కేసీఆర్ ను కలిశారు. కానీ పీకే ఐ ప్యాక్ రోజు వారీ వ్యవహారాలను పట్టించుకోలేదు. తర్వాత ఐ ప్యాక్ పని తీరు కేసీఆర్ కు నచ్చలేదు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై సర్వేలు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు లీక్ అవుతూండటంతో ప్యాకప్ చెప్పేశారు. ఇప్పుడు ఐ ప్యాక్ .. బీఆర్ఎస్ కు పని చేయడం లేదు. బీఆర్ఎస్ చీఫ్ సొంతంగా స్ట్రాటజీలు రూపొందిచుకుని అమలు చేసుకుంటున్నారు. ఐ ప్యాక్ స్ట్రాటజీలు ఏ మాత్రం తెలంగాణకు వర్కవుట్ కావని ఆయన అనుకున్నారని చెబుతున్నారు. అయితే ఇవి ఐ ప్యాక్ ఆలోచనలే కానీ.. ప్రశాంత్ కిషోర్ వి కావు. పీకే హ్యాండ్ లేకపోడంతో ఇక ఐ ప్యాక్ అక్కర్లేదని కేసీఆర్ అనుకున్నారని అనుకోవచ్చు.
ఏపీలోనూ ఐ ప్యాక్ తీరుపై అధికార పార్టీలో అసంతృప్తి
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఐ ప్యాక్ వ్యూహాలు ఉన్నాయి. ప్రజల మధ్య స్పష్టమన విభజన రేఖ సృష్టించడంతో ఓట్ల వెల్లువ వచ్చిందన్న అభిప్రాయం ఉంది. సీఎం జగన్ కు ఐ ప్యాక్ పై మంచి గురి ఉంది. అయితే వైఎస్ఆర్‌సీపీ విజయం కోసం ఐ ప్యాక్ పని చేసినప్పుడు ఆ సంస్థను ప్రశాంత్ కిషోర్ నడుపుతున్నారు. ఆయన ఆలోచనల మేరకే ఐ ప్యాక్ నడిచేది. కానీ ఇప్పుడు రోజు వారీ ఐ ప్యాక్ వ్యవహారాల్లో పీకే పాలు పంచుకోవడం లేదు. దీంతో వ్యూహాలు పెద్దగా ఫలించడం లేదన్న బాధ వైసీపీలో కనిపిస్తోంది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఐ ప్యాక్ టీం.. వైసీపీకి ఘన విజయాలు అందుతాయని రిపోర్టులు ఇచ్చిందని చెబుతారు. కానీ మొత్తం రివర్స్ అయింది. అప్పట్నుంచి ఐ ప్యాక్ టీంపై పెద్దగా వైసీపీ ఆశలు పెట్టుకోవడం లేదంటున్నారు. ప్రస్తుతం రిషిరాజ్ అే వ్యక్తి నేతృత్వంలో ఐ ప్యాక్ నడుస్తోంది.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఇక పని చేసేది లేదన్న పీకే
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇక స్ట్రాటజిస్ట్ గా పని చేసేది లేదని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. మరో వైపు ప్రస్తుతం ఐ ప్యాక్ కు ఒక్క కాంట్రాక్టే ఉందని తెలుస్తోంది. గతంలో చాలా రాజకీయ పార్టీలు ఐ ప్యాక్ సర్వీస్ కోసం ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు ఒక్క వైసీపీ తప్ప మరే పార్టీ సేవలు తీసుకోడం లేదు. దీనికి కారణం పీకే లేకపోవడమే. సంస్థలోని మిగతా వారిపై బయట వ్యక్తులకు పెద్దగా నమ్మకం లేదు. ఏపీలో వైసీపీ ఫలితంగానే ఐ ప్యాక్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఐ ప్యాక్ స్ట్రాటజీలు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నాయన్న ఆందోళన మాత్రం వైసీపీలో కనిపిస్తోంది.