Andhra Pradesh Elections 2024: ఏపీలో 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందా.. బీజేపీ నుంచి సిగ్నల్ వచ్చిందా!
BJP Alliance With TDP Janasena: తెలుగుదేశం, జనసేన కూటమిలో చేరేందుకు బిజెపి అగ్ర నాయకత్వం సానుకూలంగా స్పందించినట్లు టాక్ నడుస్తోంది. సీట్ల విషయంలో చర్చలు జరపనున్నట్లు చెబుతున్నారు.
BJP Ready To Alliance With TDP Janasena: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. సీట్లపై ఇప్పటికే చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ కూటమిలో బిజెపిని భాగస్వామిగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి స్పందిస్తూ వచ్చింది. అటు అధికార పార్టీకి పూర్తి సహకారం అందిస్తూనే ఇటు టీడీపీ, జనసేనతోనూ సన్నిహితంగా మెలుగుతోంది.
ఇలా సాగుతున్నా పొత్తు విషయం బిజెపి అగ్రనాయకత్వం తేల్చకపోవడంతో టీడీపీ జనసేన కూటమిగానే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శేట్ల సర్దుబాటుపై చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలన్న బిజెపి నిర్ణయంపై కీలక నేతలు వారించినట్లు టాక్ నడుస్తోంది. పొత్తుతో వెళ్లడం వల్ల రెండు మూడు పార్లమెంటు స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని, ఆ దిశగా ఆలోచన చేయాలంటూ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అగ్రనాయకత్వానికి సూచించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి అగ్ర నాయకత్వం రాష్ట్రంలో టిడిపి, జనసేన కూటమిలో చేరేందుకు సానుకూలంగా స్పందించినట్టు పొలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ నడుస్తోంది.
టీడీపీ, జనసేన అగ్రనేతలకు టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్!
రాష్ట్రంలో కూటమిలో చేరేందుకు బిజెపి అగ్రనాయకత్వం సంసిద్ధతను వ్యక్తం చేసిన వెంటనే.. జనసేన అగ్రనేతలకు.. బిజెపి ముఖ్య నాయకుల నుంచి సమాచారం అందినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులపై మాట్లాడుకుందామని బీజేపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందినట్లు చెబుతున్నారు. సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగిన నేపథ్యంలో బిజెపికి ఇవ్వబోయే సీట్ల విషయంలో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని బిజెపి అగ్రనాయకత్వం నుంచి ముఖ్య నేతలకు సమాచారాన్ని పంపించినట్లు చెబుతున్నారు. సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై బిజెపి కూటమి నేతలతో చర్చలు జరపనుంది.
ఈనెల 8వ తేదీ లోగా స్పష్టత..
ఇప్పటికే పలు విడతల్లో చర్చించిన జనసేన అధినేత పవన్ టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 8వ తేదీన మరోసారి సమావేశమై సీట్ల పంపకాలు విషయాన్ని కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బిజెపి నుంచి సానుకూల స్పందన రావడంతో ఒక్కసారిగా కూటమి లెక్కలు మారనున్నాయి. బిజెపి అగ్రనాయకత్వం పార్లమెంటు స్థానాలను ఎక్కువగా ఆశిస్తోంది. అందుకు ఇరు పార్టీలు అంగీకారాన్ని తెలుపుతాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. బిజెపి కోరిన పార్లమెంటు స్థానాలను ఇచ్చేందుకు ఇరు పార్టీలు అంగీకరిస్తే పొత్తు చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కూటమిలో బిజెపి చేరేది, లేనిది అన్న విషయంపై స్పష్టత కూడా ఈ నెల 8వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య జరగనున్న చర్చల్లో స్పష్టత రానుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ తో టచ్ లోకి వచ్చిన బిజెపి అగ్ర నాయకులు.. ఒకటి రెండు రోజుల్లో వీరితో చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు.
బిజెపిలో భిన్నాభిప్రాయాలు
రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలన్న బిజెపి అగ్రనాయకత్వం నిర్ణయంపై రాష్ట్రంలోని నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తుతో వెళ్లడం వల్ల మేలు జరుగుతుందని పలువురు అగ్రనాయకత్వానికి సూచిస్తుండగా.. ఒంటరిగా వెళ్లి క్షేత్రస్థాయిలో బలాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించడం మేలని మరి కొంతమంది సూచిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికలు బిజెపికి కీలకం కావడంతో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వలన ఎక్కడ వచ్చే పార్లమెంటు స్థానాలు కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవకాశం ఉంటుందని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పొత్తుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. పొత్తు చర్చలు పూర్తయిన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి మరి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన కూటమిలో బిజెపి చేరుతుందో.. లేదో.