Jubilee Hills By-elections 2025: రౌడీ షీటర్ కుమారుడు నుంచి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ది వరకు నవీన్ యాదవ్ ప్రస్తావన! మరి గెలుపు లెక్కలేంటి?
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ది నవీన్ యాదవ్ పొలిటికల్ జర్నీ విభిన్నమైంది.తండ్రి రౌడీషీటర్ అయితే, కొడుకు అధికారపార్టీ ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీలో నిలవడం ఎలా సాధ్యమైయ్యింది..!?

Jubilee Hills By-elections 2025: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తెలంగాణలో ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.అందులోనూ అధికార కాంగ్రెస్ పరిస్దితి అయితే ఇంకాస్తా ఎక్కువే అనుకోండి. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్న వేళ జరగబోతున్న ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పనితీరుకు కొలమానంగా మారాయి. అందుకేే గెలవాలి, గెలిచితీరాలనే పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్దిగా నవీన్ యాదవ్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ సైతం ప్రక్కన పెట్టి నవీన్ కుమార్ యాదవ్ పైనే కొండంత ఆశలు పెట్టుకుంది రేవంత్ సర్కార్.
తండ్రిపై రౌడీషీటర్ ఆరోపణలు.. కొడుకుపై ప్రభావం చూపుతాయా..!?
నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్. జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, రెహమత్ నగర్ తోపాటు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నాలుగు దశాబ్దాల నుంచి స్దానికంగా గుర్తింపు పొందిన నాయకుడు. నగరంలో గతంలో ఓ హత్య కేసులో శ్రీశైలం యాదవ్‌పై అనేక ఆరోపణలున్నాయి. రౌడీ షీట్ తెరవడంతోపాటు పోలీసు అధికారులు సైతం వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి. తనను అభిమానించేవారికి అండగా నిలబడతాడనే పేరు శ్రీశైలం యాదవ్ కు స్దానికంగా గుర్తింపు తెచ్చిపెట్టిందని స్దానికులంటున్నారు. శ్రీశైలం యాదవ్ పెద్దకుమారుడు నవీన్ యాదవ్.హైదరాబాద్ లోనే పుట్టిన నవీన్ యాదవ్ ఇక్కడే ఉన్నత చదువులు పూర్తి చేశాడు. తండ్రిపై సెటిల్మెంట్లు, కబ్బాలు ఇలా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ మాత్రం ఎక్కడా తన ప్రమేయం లేకండా రాజకీయాలపైనే తన దృష్టిసారించారు. స్దానికంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు , పేదలకు అండగా, స్దానిక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ,వాటిని పరిష్కరించడంలో నవీన్ యాదవ్ కీలక పాత్ర పోషించారు.
2009 ఎన్నికల నుంచి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి అవకాశం రాకపోవడంతో MIM నుంచి పోటీ చేసి 41వేలకపైగా ఓట్లు సాధించి, కాంగ్రెస్, బిఆర్ ఎస్ ను దాటి, రెండో స్దానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్దిగా పోటీ చేసి ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చారు. ఇలా తండ్రి మాస్ లీడర్ గా పేరున్నప్పటికీ నవీన్ మాత్రం ఎక్కడా గీత దాటకుండా, రాజకీయంగా అబాసుపాలు కాకుండా స్దానిక రాజకీయాల్లో తన మార్క్ కాపాడుకున్నారు. తాజాగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిచారనే ఆరోపణలపై కేసు నమోదవ్వడంతో సీటు దక్కుతుందా లేదా అని అంతా అనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నవీన్ వైపే నిలబడింది. తండ్రిపై ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ అవన్నీ తన గెలుపుపై ప్రభావం చూపవనే ధీమాతో్ ఉన్నారు నవీన్ యాదవ్.
మైనర్టీలే నవీన్ బలం.. వాళ్లే బలహీనత..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న ఇతర అభ్యర్దుల కంటే నవీన్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే మైనర్టీ మైత్రి. నవీన్ కాంగ్రెస్ అభ్యర్దిగా టిక్కెట్ దక్కించుకోవాడానికి ప్రధాన కారణం మైనార్టీ పార్టీతో ఉన్న అనుబంధమే అనే వాదనలూ ఉన్నాయి. అంతేకాదు పార్టీలకు అతీతంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్దానికంగా ముస్లిం మైనర్టీలలో నవీన్ కు మంచి ఆధారణ ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్దిగా పోటీ చేసి, ప్రధాన పార్టీలకు పోటీగా రెండో స్దానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో మైనర్టీ ఓట్లు ఇక్కడ అభ్యర్దుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవే ఓట్లు తమ అభ్యర్ది నవీన్ ను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. నాణ్యానికి మరోవైపు చూస్తే ఎంఐఎంతో నవీన్ దోస్తీ బీజేపికి విమర్శనాస్త్రంగా మారునుంది. మైనర్టీయేతర ఓటర్లను ఆకర్షించడంతోపాటు , కాంగ్రెస్ ను హిందూ వ్యతిరేకిగా నవీన్ ను బీజేపి చిత్రీకరించే అవకాశాలున్నాయి.
ఓసీ అభ్యర్దులు వర్సెస్ బీసీ సెంటిమెంట్...
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్ది మాగంటి గోపీనాథ్ భార్య సునీత కమ్మ సమాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్ది కావడంతోపాటు, మరో ప్రధాన పార్టీ బీజేపి అభ్యర్ది కూడా ఓసీ సమాజిక వర్గానికి చెందినవారికే టిక్కెట్ కేటాయించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీసీ అభ్యర్దిగా పోటీపడుతున్న నవీన్ కుమార్ యాదవ్ కు బీసి ఓటు బ్యాంక్ కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. పార్టీలకు అతీతంగా 2009 నుంది 2025 వరకూ సుదీర్గకాలం ఇదే నియోజవర్గంలోని ప్రజలకు దగ్గరగా ఉండటం నవీన్ కు కలిసొచ్చే మరో ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ఇక్కడ ఓసీ ఓటర్లను సైతం తక్కువ అంచనా వేయలేము. నియోజకవర్గంలో అభ్యర్దుల గెలుపోటములు నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తారు. వీరంతా ఓసీ అభ్యర్దుల వైపు మళ్లితే, నవీన్ గెలుపు ఆశించిన స్దాయిలో నల్లేరుమీద నడక మాత్రం కాదు. దివంగత నేత మాగంటి గోపీనాథ్‌పై సింపతీ జానాల్లో ఇంకా చల్లారనప్పటకీ, తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న గోపీనాథ్ ఫాలోవర్స్ ప్రభావం నవీన్ కు ఏటికి ఎదురీతలా మారనుంది.





















