Ap Elections 2024: ఓటేసేందుకు సొంతూళ్లకు పయనం - హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ
Andhra pradesh News: ఎన్నికల వేళ సొంతూళ్లకు జనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో సొంత వాహనాల్లో చాలామంది బయలుదేరుతుండడంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.
![Ap Elections 2024: ఓటేసేందుకు సొంతూళ్లకు పయనం - హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ heavy traffic in hyderabad and vijayawada highway due to ap assembly elections Ap Elections 2024: ఓటేసేందుకు సొంతూళ్లకు పయనం - హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/11/e069197f711b47e4dcc92047f41793801715408581218876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heavy Rush In Hyderabad And Vijayawada Highway: ఏపీలో ఓట్ల పండుగ మొదలు కానుంది. ఎన్నికల వేళ అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ (Hyderabad)లో స్థిరపడిన ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఇక్కడ ఉండి ఐదేళ్లకోసారి తమకు ఇష్టమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా సొంతూళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఓటర్లు ప్రత్యేక బస్సులు, రైళ్లలో ఊర్లకు చేరుకుంటుండగా.. ఇంకొందరు తమ సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ (Vijayawada) హైవేపై రద్దీ నెలకొంది. వారాంతం, వరుస సెలవులు, పోలింగ్ కు ఇంకా రెండు రోజులే టైం ఉండడంతో శనివారం వేకువజాము నుంచే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ఈ వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖ వైపు తరలివెళ్తున్నాయి. జాతీయ రహదారిపై రద్దీ నేపథ్యంలో నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు, హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెంట్ వరకూ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. అటు, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.
ప్రత్యేక బస్సులు
మరోవైపు, హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కేటాయించింది. అటు, దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రమే పలువురు ప్రత్యేక బస్సులు, రైళ్లలో తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. కాగా, పది రోజుల ముందే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రయాణికుల రద్దీని బట్టు మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ!
ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎన్నికల టైంను క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో ఏపీలోని ప్రధాన నగరాలకు రూ.500 నుంచి రూ.1000 వరకూ టికెట్ ఛార్జీలుండగా.. ప్రస్తుతం రూ.5 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ టికెట్ రేట్లు రూ.2,500 వరకూ చూపిస్తున్నాయని పేర్కొంటున్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి విశాఖ, రాజమండ్రి, కడప, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు సైతం అదే రేంజ్ లో రేట్లు చూపిస్తున్నాయని చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకుల రద్దీ నెలకొంది. గన్నవరం విమానాశ్రయం శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీగా మారింది. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఓటర్లు ఇక్కడ దిగుతున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం ఓటేసేందుకు తమ సొంతూళ్లకు వస్తుండడంతో ఎయిర్ పోర్టులు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలో భారీగా రద్దీ నెలకొంది. దీంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
Also Read: Election campaign: సాయంత్రం తర్వాత మూగబోనున్న మైకులు-6గంటల వరకే ప్రచారానికి గడువు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)