YSRCP News: 'జగన్ చెప్పిందే చేస్తాడు...చేయనది చెప్పడు' సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ నినాదమిదే!
Ycp Election Manifesto: ఎన్నికల ప్రణాళికకు జగన్ తుది మెరుగులు దిద్దుతున్నారు. నవరత్నాలకు అధనంగా పథకాలు జోడించనున్నారు. యువతకు ఉపాధికల్పనతోపాటు, నాడు-నేడు కిందకు మరికొన్నింటిని తీసుకురానున్నారు.
YCP Manifesto: ఒక్కఛాన్స్ ...ఈ నినాదం జనంలో మారుమోగింంది, చిన్నా, పెద్ద, పల్లె,పట్నం తేడా లేకుండా ప్రతిఒక్కరికీ చేరింది. మౌత్‌టాక్‌కు మించిన ప్రచారం లేదని నిరూపిస్తూ...ఏకంగా జగన్(Jagan)ను గద్దెనెక్కించింది. ఇప్పుడు అలాంటి మరో నినాదమే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీకి ఎంతో అవసరం ఉంది. అందుకు ఆ పార్టీ పెద్దలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్(Jagan) మాటతప్పడు, మడమ తిప్పడు డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి నినాదంతోనే జగన్ జనంలోకి వెళ్లనున్నారు. జగన్ చెప్పిందే చేస్తాడు...చేయలేనిది చెప్పడంటూ ప్రజల ఆశీర్వాదం తీసుకోనున్నారు. పేజీల కొద్దీ ఉండే ఎన్నికల మ్యానిఫెస్టో(Manifesto) )కు మంగళంపాడి....నవరత్నాల పేరిట కేవలం ఒకే ఒక్క పేజీకి కుదించిన జగన్...ఇప్పుడు వాటికే మెరుగులద్దుతున్నారు...
వైసీపీపా మేనిఫెస్టోకు తుదిమెరుగులు
నవరత్నాల హామీ వైసీపీ(YCP)కు ఎంతో కలిసొచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తెల్లారి వచ్చే న్యూస్‌పేపర్‌లా కన్‌ఫ్యూజన్ లేకుండా జనాలకు ఏం కావాలో అది సూటిగా సుత్తిలేకుండా కేవలం తొమ్మిదే తొమ్మిది హామీలతో జనాలకు చేరువయ్యారు జగన్(Jagan). వారికి ఏం కావాలో...తాను ఏం ఇవ్వదలుచుకున్నాడో డొంకతిరుగుడు లేకుండా నేరుగా చెప్పేశారు. గత ఎన్నికల సమయంలో నవరత్నాలు(Navarathnalu) అందిరి నోళ్లలో నానాయి. ఇప్పుడు ఇవే హామీలకు మరికొన్ని జోడించి వైసీపీ మేనిఫెస్టోకు తుది రూపుదిద్దుతోంది.
ఐప్యాక్ ప్రతినిధులతో చర్చించిన సీఎం జగన్....మ్యానిఫెస్టోలో ఏయే అంశాలు ఉండాలో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పల్లె ప్రజలను దృష్టిలో ఉంచుకుని అన్ని హామీలు అమలు చేసిన వైసీపీ...ఇప్పుడు పట్టణ ఓటర్లనూ ఆకర్షించేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తోంది. పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా కొన్ని పథకాలను చేర్చనున్నారు. అభివృద్ధి,సంక్షేమం రెండూ అందించేలా మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ యువత(Urban Youth)ను లక్ష్యంగా చేసుకుని వారిని ఆకర్షించే పథకాలు రూపొందించనున్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పటికే చట్టం తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం...ఈసారి దీన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేలా కొత్తపథకాలకు శ్రీకారం చుట్టబోతోంది.
అలాగే ఇంటింటికి మంచినీటి కులాయిపైనా ప్రత్యేక హామీ ఇవ్వనున్నారు. నాడు, నేడు కింద గతంలో విద్య, వైద్యశాఖలనే ఈ పథకం కింద తీసుకురాగా..ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే మరో మూడు, నాలుగుశాఖలను తీసుకురానున్నారు. ప్రజలతో నిత్యం అనుసంధానమయ్యే...వారికి అవసరమయ్యే శాఖలను గుర్తించి నాడు-నేడు పథకంలో చేర్చనున్నట్లు తెలిసింది.
మాటిస్తే...మడమ తిప్పడు
జగన్ మాటిస్తే...మడమ తిప్పడు ఎంతవరకు సాధ్యమైందనేది చెప్పలేం కానీ...వైసీపీ(Ycp) శ్రేణుల్లో మాత్రం దీన్ని గట్టిగా నమ్ముతారు. జగన్ చెప్పాడంటే చేస్తాడు.. ఇప్పుడు దీన్నే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ యోచిస్తోంది. జగన్ చెప్పిందే చేస్తాడు..చేయనది చెప్పడు అనే నినాదాన్ని వినిపించనున్నారు.ఈనెల 27 నుంచి జగన్ చేపట్టనున్న ఎన్నికల ప్రచారయాత్రలో ఇదే నినాదం వినిపించనుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే...కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చనున్నారు. ముఖ్యంగా జగన్‌కు ఓట్లు తెచ్చిపెట్టిన అమ్మఒడి, జగనన్న ఇల్లు, ఆసరా పింఛన్లు, రైతుబంధు, చేయూత పథకాలను ఈసారీ కొనసాగించనున్నారు. మేనిఫెస్టోను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.