Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Four States Election Results 2023: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది.
4 States Election Results 2023:
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. దాదాపు ఆర్నెల్లుగా 5 రాష్ట్రాల ఎన్నికల (Five States Elections 2023) వేడి దేశమంతా కనిపించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం ఎన్నికల ఫలితాల (Elections Results 2023) కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. వీటిలో మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి. అన్ని పార్టీలూ గెలుపుపై చాలా ధీమాగా ఉన్నాయి. ఎవరి అంచనాలు వారివే అయినా..తుది ఫలితాలు వెల్లడైతే కానీ ఎవరి ఫ్యూచర్ ఏంటన్నది తేలదు. మరి కొద్ది గంటల్లోనే ఎవరి భవితవ్యం ఏమిటో తేలిపోతుంది.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే కాంగ్రెస్ తమ పరిపాలనపై చాలా ధీమాగా ఉంది. తాము ప్రవేశపెట్టిన సంక్షేమాలే గెలిపిస్తాయని చెబుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి కాస్త సానుకూలత ఉన్నప్పటికీ రాజస్థాన్‌లో మాత్రం వ్యతిరేకత కొంత వరకూ ఉంది. అందుకు ప్రధాన కారణంగా అంతర్గత కలహాలు. సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ మధ్య విభేదాలు తలెత్తాయి పదేపదే అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగరేశారు సచిన్ పైలట్. ఇది ఆ పార్టీని చాలానే ఇబ్బంది పెట్టింది. ప్రజల్లోనూ కాంగ్రెస్ పట్ల నమ్మకం సన్నగిల్లేలా చేసింది. అయినా సరే గెలుపుపై కాన్ఫిడెంట్‌గానే ఉంది కాంగ్రెస్. ఈ సవాళ్లన్నింటినీ దాటుకుని విజయం సాధిస్తామని చెబుతోంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం పూర్తిగా బీజేపీకే మొగ్గు చూపాయి.
గెలుపెవరిదో..?
ఇక మధ్యప్రదేశ్ సంగతి చూస్తే...అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బలమైన నేత అయినప్పటికీ వెనకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారన్న విమర్శలున్నాయి. దళితులపై దాడులు జరగడం ప్రభుత్వానికి మచ్చతెచ్చి పెట్టింది. దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుంది కాంగ్రెస్. కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండడమూ కాంగ్రెస్‌కి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లోనూ కాంగ్రెస్‌కి పాజిటివ్ వేవ్ కనిపించింది. ఇక తెలంగాణ విషయానికొస్తే...BRSపై ఈ సారి వ్యతిరేకత కాస్త గట్టిగానే కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. యువత, ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్ సర్కార్‌పై గుర్రుగా ఉన్నారన్నది మరో వాదన. ఇప్పటి వరకూ అసలు సోదిలోనే కాంగ్రెస్...సరిగ్గా ఎన్నికల ముందు యాక్టివ్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఆరు గ్యారెంటీలతో జనాల్లోకి వెళ్లింది. గట్టిగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కీలక నేతలు తెలంగాణలో ప్రచారం చేశారు.
ఇప్పటికే దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంతో ఉంది ఆ పార్టీ. ఇప్పుడు తెలంగాణలోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో ఉంది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కి సానుకూలమైన అంచనాలు వచ్చాయి. ఇది ఆ పార్టీకి మరింత కాన్ఫిడెన్స్ పెంచింది. రాజస్థాన్‌ని కోల్పోయినా తెలంగాణలో నిలదొక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయన్నది ఎగ్జిట్ పోల్ అంచనాల విశ్లేషణ. మొత్తంగా...ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. మరి కొద్ది గంటల్లోనే పంచ్ ఎవరిదో..పతనమెవరిదో క్లారిటీ వచ్చేయనుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply