Nominations Over : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూండటంతో అక్కడే ఎక్కువ హడావుడి కనిపించింది.
Election Nominations in Telugu states is over : సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. గురువారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నిమినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇండిపెండెంట్లకు గుర్తుకు ఖరారు చేస్తారు. వచ్చే నెల పదకొండో తేదీ సాయంత్రం వరకూ ప్రచార గడువు ఉంది. పదమూడో తేదీన పోలింగ్ జరుగుతుంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా !
జమిలీ ఎన్నికలు జరుగుతున్నందున ఏపీలో ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. 175 నియోజకవర్గాల్లో రెండు ప్రాధన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. నామినేషన్ల దాఖలుకు భారీ బలప్రదర్శన చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా హంగామా చేశారు. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం వరకూ 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు మరో వెయ్యి వరకూ దాఖలయ్యే అవకాశం ఉంది. మొత్తం ఎన్ని దాఖలయ్యాయన్నదానిపై అధికారిక ప్రకటన ఈసీ చేసే అవకాశం ఉంది. ఏపీలో లోక్ సభ కూడా ఎన్నికలు కూడా జరుగుతున్నా.. జాతీయ అంశాలు కానీ .. లోక్ సభ ఎన్నికల అంశం కాని హైలెట్ కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలే ప్రధానంగా మారాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మాత్రమే !
తెలంగాణలో గత డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయాయి. ఈ కారణంగా లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. ఐదు నెలల్లోనే మళ్లీ ఎన్నికలు రావడంతో క్షేత్ర స్థాయిలో పెద్దగా ఎన్నికల వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు మాత్రం హడావుడిగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఈ లోక్ సభ ఎన్నికలు కీలకం కావడంతో బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసి ప్రచార బరిలోకి దిగారు.
ఇక ప్రచార హోరు !
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో అగ్రనేతలు వరుసగా పర్యటించబోతున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. అమిత్ షా, రాజ్ నాత్ సింగ్ వంటి వారు ఇప్పటికే తెలంగాణలో సభలు నిర్వహించారు. ఏపీలోనూ ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. వచ్చే రెండు వారాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తనుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూండటంతో ఏపీలోనే ఎక్కువ సందడి కనిపిస్తోంది.