Devineni Uma : తెలంగాణ బీజేపీ అభ్యర్థికి ఓటేయండి - దేవినేని ఉమ పిలుపు వైరల్
TDP News : చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి దేవినేని ఉమ మద్దతు పలికారు. ఆయనకు ఓటేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు.
Devineni Uma supported Chevella BJP candidate Konda Vishweshwar Reddy : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమహేశ్వరరావు మద్దతు పలికారు. ఆయనకు ఓటేయాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారికి పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతుడు, పలు కంపెనీలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయనకు ప్రజలు తమ మద్దతు తెలియజేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నానన్నారు. పార్లమెంటులో పలు భాషలలో అనర్గళంగా మాట్లాడి నియోజకవర్గానికి నిధులు తీసుకురాగల సమర్ధుడు, సమాజం పట్ల బాధ్యత, సేవాభావం కలిగి, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న ఆయనకు మద్దతుగా నిలబడడం మనందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి, దేవినేని ఉమ మధ్య మంచి స్నేహం ఉన్నట్లుగా చెబుతున్నారు. పార్టీ పరంగా ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తులో ఉన్నా.. తెలంగాణ విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ ఇంకా ప్రకటన చేయలేదు. ప్రచారం కూడా చేయడం లేదు. దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా పూర్తిగా వ్యక్తిగత హోదాలోనే కొండా విశ్వేశ్వర రెడ్డికి మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. ఆయన పార్టీ తరపున పిలుపునివ్వలేదు.
ఉన్నత విద్యావంతుడు, పలు కంపెనీలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న @KVishReddy గారికి ప్రజలు తమ మద్దతు తెలియజేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. పార్లమెంటులో పలు భాషలలో అనర్గళంగా మాట్లాడి నియోజకవర్గానికి… pic.twitter.com/yPXG9QHKeJ
— Devineni Uma (@DevineniUma) April 26, 2024
కొండా విశ్వేశ్వర్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం ఐదు వేల కోట్ల వరకూ ఆస్తులు ఉన్న ధనవంతుడు. అనేక కంపెనీలను పెట్టి యువతకు ఉపాధినిస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా.. కెవి రంగారెడ్డి కి గుర్తుగా ఆ పేరు పెట్టారు. కెవి రంగారెడ్డి మనవడే కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన అపోలో ఆస్పత్రుల కుటుంబ సభ్యుడు. ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మొదట 2014లో టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఆ పార్టీలో ఇమడ లేక 2019లో బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఈ సారి బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇటీవల చేవెళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఆయన మంచి వ్యక్తే కానీ..బీజేపీకి ఓటు వేస్తే వృధా అన్నారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పార్టీలకు అతీతంగా పలువురు నేతలు మద్దతు పలుకుతున్నారు.
దేవినేని ఉమామహేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో టిక్కెట్ లభించకపోవడంతో పోటికి దూరంగా ఉన్నారు. అయినా మైలవరం నియోజకవర్గంలో టిక్కెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ కోసం ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఎన్నికల ప్రక్రియలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.