Delhi Assembly Election Result 2025: నిజమే ఢిల్లీ ఎన్నికల్లో ఆఫ్‌ను ఓడించింది కాంగ్రెసే- పొత్తుతో వెళ్లుంటే లెక్కలు మారేవా?
Delhi Assembly Election Result 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. నాల్గోసారి అధికారంలోకి వస్తామని కలలు కన్న ఆప్ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిలో కాంగ్రెస్ కూడా భాగమైంది.

Delhi Assembly Election Result 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరవ లేదు. చాలా సీట్లలో అభ్యర్థులకు డిపాజిట్స్ కూడా రాలేదు. చాలా చోట్ల మూడో స్థానానికే పరిమితం అయ్యారు. అయితే ఇంత దారుణంగా పరాజయం పాలైన కాంగ్రెస్ మరోవైపు కేజ్రీవాల్‌కు గట్టిదెబ్బ వేసింది. పదికిపైగా సీట్లలో భారీ నష్టాన్ని మిగిల్చింది.
మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీలోనే కాంగ్రెస్‌కు మంచి ఓట్లు వచ్చాయి. అవే ఆప్‌వైపు టర్న్ అయి ఉంటే కచ్చితంగా కేజ్రీవాల్ విజయం సాధించి ఉండే వాళ్లు. మంత్రి సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్‌పురా సీటు ఇలా అన్ని సీట్లలో ఆప్ విజయాన్ని హస్తం అడ్డుపెట్టి ఆపేసింది.
కాంగ్రెస్ కారణంగా ఆప్ ఓడిపోయిన సీట్లు
న్యూఢిల్లీ
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మూడవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ 4568 ఓట్లు సాధించారు. కేజ్రీవాల్ కు 42.18 శాతం ఓట్లు, పర్వేశ్ వర్మకు 48.82 శాతం ఓట్లు వచ్చాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన సందీప్ దీక్షిత్‌కు 7.41 శాతం ఓట్లు వచ్చాయి. ఒకవేళ పొత్తుతో కలిసి వెళ్లుంటే ఇంతటి పరాజయం మూటకట్టుకోవాల్సి వచ్చేది కాదని అంటున్నారు విశ్లేషకులు
జంగ్‌పురా
జంగ్‌పురా స్థానంలో బిజెపికి చెందిన తర్విందర్ సింగ్ మార్వా విజయం సాధించారు. ఇక్కడ ఆప్ తరఫున మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి 675 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ కూడా ఆప్ పరాజయానికి కాంగ్రెస్ పరోక్షంగా కారణం అయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌కు చెందిన ఫర్హాద్ సూరికి (7350) ఓట్లు వచ్చాయి. మార్వాకు 45.44 శాతం, ఫర్హాద్ సూరికి 8.6 శాతం, మనీష్ సిసోడియాకు 44.65 శాతం ఓట్లు వచ్చాయి.
గ్రేటర్ కైలాష్
గ్రేటర్ కైలాష్‌లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ 3188 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బిజెపికి చెందిన శిఖా రాయ్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6711 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సౌరభ్ కూడా బీజేపీ విజయానికి కారణం అయ్యారనే చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్‌కు 6.46 శాతం, బిజెపికి 47.74 శాతం, ఆప్‌కు 44.67 శాతం ఓట్లు వచ్చాయి.
మాలవీయ నగర్
మాలవీయ నగర్‌లో గెలుపు, ఓటమిల తేడా 2131 ఓట్లు. బిజెపికి చెందిన సతీష్ ఉపాధ్యాయ్ మాజీ మంత్రి, ఆప్ నాయకుడు సోమనాథ్ భారతిని ఓడించారు. భారతి ఓడిపోయిన ఓట్ల సంఖ్య కంటే కాంగ్రెస్ అభ్యర్థి జితేంద్ర కుమార్ కొచ్చర్ కు ఎక్కువ ఓట్లు (6770) వచ్చాయి. బిజెపి ఓట్ల వాటా 46.53 శాతం, ఆప్ 44.02 శాతం, కాంగ్రెస్ 7.96 శాతం.
రాజేంద్ర నగర్
రాజేంద్ర నగర్‌లో బిజెపికి చెందిన ఉమాంగ్ బజాజ్ ఆప్‌కు చెందిన దుర్గేష్ పాఠక్‌ను 1231 ఓట్ల తేడాతో ఓడించగా, కాంగ్రెస్‌కు 4015 ఓట్లు వచ్చాయి. ఓట్ల వాటా గురించి మాట్లాడుకుంటే, బిజెపికి 48.01 శాతం, ఆప్‌కు 46.74 శాతం, కాంగ్రెస్‌కు 4.13 శాతం ఓట్లు వచ్చాయి.
సంగం విహార్
ఆప్ అభ్యర్థి దినేష్ మోహానియా బీజేపీ అభ్యర్థి చందన్ చౌదరి చేతిలో కేవలం 344 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ కు కూడా మంచి సంఖ్యలో ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్ చౌదరి 15863 ఓట్లు సాధించి ఆప్ విజయాన్ని పాడు చేశారు. కాంగ్రెస్ కు 12.62 శాతం, బిజెపికి 42.99 శాతం, ఆప్ కు 42.72 శాతం ఓట్లు వచ్చాయి.
తిమార్పూర్
బిజెపికి చెందిన సూర్య ప్రకాష్ త్రిపాఠి ఆప్‌కు చెందిన సురేంద్ర పాల్ సింగ్‌ను 1168 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ 8361 ఓట్లు వచ్చాయి. బిజెపికి 46.03 శాతం, ఆప్‌కు 45.07 శాతం, కాంగ్రెస్‌కు 6.88 శాతం ఓట్లు వచ్చాయి.
Also Read: ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేసిన అధికారులు - కేజ్రీవాల్ అవినీతిపై సిట్ వేస్తామన్న బీజేపీ
మెహ్రౌలి
మెహ్రౌలిలో కూడా కాంగ్రెస్ ఆప్ గేమ్‌ను డిస్టర్బ్ చేసింది. ఆప్ అభ్యర్థి మహేంద్ర చౌదరి బిజెపికి చెందిన గజేంద్ర సింగ్ యాదవ్ చేతిలో 1782 ఓట్ల తేడాతో ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ 9731 ఓట్లు వచ్చాయి. ఓట్ల వాటా గురించి మాట్లాడుకుంటే, బిజెపికి 41.67 శాతం, ఆప్‌కు 40.13 శాతం, కాంగ్రెస్‌కు 8.05 శాతం ఓట్లు వచ్చాయి.
త్రిలోక్‌పురి
ఆప్ అభ్యర్థి అంజనా పర్చా బీజేపీ అభ్యర్థి రవికాంత్ చేతిలో కేవలం 392 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి అమర్‌దీప్‌కు 6147 ఓట్లు రాకపోతే ఆమె గెలిచి ఉండేది. ఓట్ల వాటా గురించి మాట్లాడుకుంటే, బిజెపికి 46.1 శాతం, ఆప్‌కు 45.79 శాతం, కాంగ్రెస్‌కు 4.87 శాతం ఓట్లు వచ్చాయి.
దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెట్ 'X' లో రియాక్ట్ అయ్యారు. "ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడం కాంగ్రెస్ బాధ్యత కాదు. మేము ఒక రాజకీయ పార్టీ, ఒక NGO కాదు." అని ట్వీట్ చేశారు. ఈ లెక్కలను చూసే తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించిన రాహుల్‌గు అభినందనలు అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read: కేజ్రీవాల్ ఓటమి స్వయం కృతాపరాథం - ఐదు ప్రధాన కారణాలు ఇవే !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

