Dasthagiri: 'వివేకానంద రెడ్డి హత్య వెనుక సీఎం జగన్' - అప్రూవర్ గా మారిన దస్తగిరి హాట్ కామెంట్స్
Dastagiri Makes Hot Comments: వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేక హత్య వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ ఆరోపించారు.
Dastagiri Sensational Comments on CM Jagan: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేక హత్య వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో రాజకీయంగా వేడిని పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారన్నారంటూ దస్తగిరి పేర్కొన్నారు. అప్రూవర్ గా మారినందుకు తనను ఎలా అయినా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించారని, తాను ఎంతకీ లొంగకపోవడంతో చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. నాలుగు నెలల పాటు కడప జైల్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను కలిసి బెదిరించాడని దస్తగిరి ఆరోపించారు.
'సీఎం జగన్ కు ఓటు అడిగే హక్కు ఉందా.?'
చైతన్య రెడ్డి తీవ్ర స్థాయిలో తనను బెదిరించాడని దస్తగిరి పేర్కొన్నారు. జైల్లో అధికారులు కూడా చిత్రహింసలు పెట్టారని వాపోయారు. వివేకానందను చంపిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటే, ఆయన్ను చంపిన సీఎం జగన్ కు కూడా పులివెందులలో ఓటు అడిగే హక్కు ఉంటుందా.? అని ప్రశ్నించారు. 14 రోజుల పాటు 24 గంటలు లాకప్ లోనే ఉండేలా చేసి హింసించారని, తాను ఇవన్నీ భరించలేక లాకప్ లో ఉన్న దుప్పట్లతో ఉరి వేసుకుని చనిపోతానని చెప్పడంతో కాసేపు బయటికి పంపి మళ్లీ లాకప్ లో పెట్టేవారని లేఖలో ప్రస్తావించారు. తన భార్య మతి స్థిమితం లేకుండా మాట్లాడుతోందని, జైల్లో తనను ఎవరు కలవలేదనేలా జైలో సూపరింటెండెంట్ తనతో లేఖ రాయించుకున్నారని దస్తగిరి మండిపడ్డారు. జైల్లో చైతన్యను కలిసినప్పటికీ సీసీ టీవీ ఫుటేజ్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశాడు. చైతన్య తనని బెదిరించి రూ.20 కోట్లు ఆఫర్ చేసిన విషయంతో పాటు జైలు అధికారులు హింసించిన వ్యవహారంపై విచారణ జరపాలని సీబీఐని కోరారు. కొన్ని పత్రికల్లో తాను గొడ్డలి పట్టుకొని ఉన్నట్లు కార్టూన్లు కూడా వేశారని, ఆ కార్టూన్ పక్కనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి ఉండేలా ఫోటోలు వేసి ఉంటే ఇంకా బాగుండేదని వ్యాఖ్యానించారు. ఎంపీ టికెట్ విషయంలోనే వివేకానంద రెడ్డిని హత్య జరిగి ఉంటుందని దస్తగిరి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తాను జై భీమ్ భారత్ పార్టీ నుంచి పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని దస్తగిరి స్పష్టం చేశారు.
'డ్రామాలాడుతున్నది ఎవరో తెలుసు'
తాము డ్రామాలాడుతున్నట్లు చెబుతున్నారని దస్తగిరి విమర్శించారు. డ్రామాలు ఎవరు ఆడుతున్నారో అందరికీ తెలుసని అన్నారు. ఈ ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉందని, మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ అధికారులకు కట్టుకథలు చెప్పామని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా ఉంటామని జగన్, భారతిరెడ్డి నుంచి సమాచారం వచ్చిందని దస్తగిరి వివరించారు. మాట వినకుంటే మమ్మల్ని ఏదో ఒకటి చేస్తాం అనే ధీమాతో ఉన్నారన్నారు. తనకు సహాయం చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేశారని, తన తరఫున వాయిదాలకు తిరగకూడదని కడపకు చెందిన లాయర్ చంద్రగుప్తను భయపెట్టారని ఆరోపించారు. జైలులో జరిగిన ప్రతి అంశం పైన జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు దస్తగిరి వివరించారు.