Congress On Telangana New CM: తెలంగాణ సీఎం అభ్యర్థిపై హైకమాండ్‌కు నివేదిక ఇచ్చిన డీకే శివకుమార్- ఖర్గే నివాసంలో కీలక భేటీ
Telangana News: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక కసరత్తును కాంగ్రెస్ తీవ్రం చేసింది. రెండు మూడు గంటల్లో దీనిపై క్లారిటీ ఇచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఢిల్లీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
Telangana CM Candidate: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక కసరత్తును కాంగ్రెస్ తీవ్రం చేసింది. రెండు మూడు గంటల్లో దీనిపై క్లారిటీ ఇచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా ఢిల్లీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఠాక్రేతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ ఇద్దరి నేతలతో ఠాక్రే, డీకే విడివిడిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. వారి అభిప్రాయలతోపాటు మెజార్టీ ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఓ నివేదిక సిద్ధం చేశారు. దీనిని హైకమాండ్‌కు డీకే శివకుమార్ అందజేశారు.
తెలంగాణ సీఎం అంశంపై ఖర్గే నివాసంలో డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఠాక్రే మాట్లాడుతున్నారు. ఖర్గే నివాసంలో భేటీకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్... ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని నివేదిక సమర్పించిన తర్వాత సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
రెండు రోజుల నుంచి తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. సోమవారం సీఎల్పీ సమావేశం జరిగినా నాయకుడిని ఎంపిక చేయడంలో ఏఐసీసీ ప్రతినిధులు విజయవంతం కాలేకపోయారు. రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించాలని కొందరు నేతలు పట్టుబట్టినా ఒకరిద్దరి అభ్యంతరంతో ఆ విషయంపై పీఠముడి పడింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం నడుస్తోంది.
రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది ఆ ఇద్దరేనా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల ముందు నుంచి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చని లీడర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వారంతా రేవంత్ పని తీరుపై అభ్యంతరం చెబుతూ వచ్చారు. ఎన్నికల నాటికి అందర్నీ అధినాయకత్వం సైలెంట్ చేసింది. ముందు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేయాలని సూచించింది. దీని ప్రకారం అంతా కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ పాత్ర ఎక్కువ ఉందని మెజార్టీ ఎమ్మెల్యే అభిప్రాయం. అయితే దీన్ని రేవంత్‌కు వ్యతిరేకంగా పని చేసిన కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఆయన సీఎంగా ఉంటే తాము అంగీకరించలేమంటూ తేల్చి చెప్పినట్టు సమాచారం. అందుకే రేవంత్ పేరు ఖరారు చేయడానికి అధినాయకత్వం బుజ్జగింపుల బాట పట్టింది.
ఈ క్రమంలో కేవలం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కను మాత్రమే పిలవడంతో చూపులన్నీ వారిద్దరిపైనే ఫోకస్ అయ్యాయి. వారే రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అయితే సోమవారం జరిగిన భేటీలో చాలా గొంతుకలు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించినప్పటికీ వారిని అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉత్తమ్, భట్టీ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్‌లు కావడంతో వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మిగతా వారి తరఫున వారినే ఢిల్లీకి పిలిచినట్టు తెలుస్తోంది.
వారిద్దరిని కూల్ చేసిన తర్వాత మిగతా వాళ్లకు సర్ది చెప్పవచ్చని భావిస్తోంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి పేరు చెబితే ఒంటికాలిపై లేచే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రేవంత్ అంటే పడని మరో సీనియర్ జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
గతంలో ఏ చిన్న సమస్య వచ్చినా మీడియా ముందుకు వచ్చే నేతలు ఈసారి మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఫలితాలు వచ్చి రెండు రోజులు అవుతున్నా కీలక నేతలు ఎవరూ తమ అభిప్రాయాలు చెప్పేందుకు మీడియా ముందుకు రాలేదు. గెలిచిన తర్వాత చాలా మంది మీడియా ముందుకు వచ్చి సీఎం అభ్యర్థిపై తమ అభిప్రాయలు పంచుకుంటారని అంతా అనుకున్నారు కానీ అలాంటిదేమీ కనిపించలేదు. గెలిచిన వాళ్లు ఓడిపోయిన వాళ్లు అంతా సైలెంట్‌గా ఉంటున్నారు.
నిర్ణయం తీసుకునే వరకు లీడర్లు ఎవరూ ఇష్టం వచ్చినట్టు మీడియాతో మాట్లాడొద్దని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే మీడియాతో మాట్లాడిన ఒకరిద్దరు నేతలు కూడా లోపల జరుగుతున్న విషయాలపై డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న కథనాలు ఖండిస్తున్నారు.