Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Andhra Politcs : ఏపీ పోస్టల్ బ్యాలెట్ లెక్కను ఈసీ ప్రకటించింది. గతం కన్నా రెట్టింపులో ఓట్లు పోలయ్యాయి.
Elections 2024 : ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు. ఎన్నికల విధులో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 4,44,216 మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ పోలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఈ నెల 5 న ప్రారంభమై 9న ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగింపు రోజైన 9 వ తేదీన న పార్లమెంటు నియోజకవర్గాలకు 11,374 ఓట్లు, అసెంబ్లీ నియోజక వర్గాలకు 11,370 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అత్యధిక మొత్తంలో 22,650 పోస్టల్ బ్యాలెట్ నెల్లూరు నియోజక వర్గంలో పోల్ అవ్వగా, అత్యల్పంగా 14,526 ఓట్లు అమలాపురం (ఎస్సీ) నియోజక వర్గంలో పోల్ అయ్యాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న ఇద్దరు ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయలేదు.
ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4 లక్షల 30 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో లక్షా 5 వేల మంది టీచర్లే ఉన్నారు.. 40 వేల మంది పోలీసులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలేట్ ఉపయోగించుకున్న వారు 2 లక్షల 38 వేల మంది మాత్రమే.. కానీ ఈ నంబర్ ఇప్పుడు డబుల్ అయ్యింది. ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్ ఇమేజ్ ఉంటే ఓటు వేయడానికి ఆసక్తి చూపించరు కానీ వ్యతిరేకత ఉంటేనే ఓటు రూపంలో చూపిస్తారన్న చర్చ జరుగుతుంది. గతంలో లేనట్టుగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఓటింగ్ తమకు అనుకూలమంటే.. తమకని అటు కూటమి, ఇటు వైసీపీ నేతుల చెప్పుకుంటున్నారు.
పార్టీల నేతలు వీరిని కూడా ప్రలోభాలకు గురి చేయాలనుకున్నారు. కొన్ని చోట్ల 5 వేలు.. మరికొన్ని చోట్ల 3 వేలు అంటూ బేరసారాలు నడిచాయి. కొందరికి ఎన్వలప్స్‌లో మరికొందరికి యూపీఐ ద్వారా పేమెంట్స్ అందినట్టు ఆరోపణలు వినిపించాయి. అయితే ఈసీ దీనిపై ఫోకస్ చేసింది.. కొందరు ఉద్యోగులపై చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. దాంతో ప్రలోభాలు చాలా వరకు తగ్గిపోయినట్లుగా భావిస్తున్నారు.