Telangana Election News: కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ - ఆదిలాబాద్‌లో చత్తీస్ గఢ్ సీఎం
Adilabad News: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రజాసేవా భవన్‌లో చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ మీడియాతో మాట్లాడారు.
Chhattisgarh CM in Adilabad: కర్ణాటక తరహా ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవుతాయని, 6 ఆరు గ్యారంటీలపై ప్రజలకు విశ్వాసం ఉందని చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రజాసేవా భవన్‌లో ఆదిలాబాద్ (Adilabad) కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి, కర్నాటక ఎమ్మెల్సీ, ఆదిలాబాద్ (Adilabad) పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రకాష్ రాథోడ్ తో కలిసి ఏర్పాటు చేసీన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కనిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతూ రాజ్యాధికారం చేపడుతున్నారని దుయ్యబట్టారు.
10 ఏళ్ల తెలంగాణాలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అన్నారు. భూమి, నీరు, మద్యం, ఖనిజ వనరులన్నీ కేసీఆర్ కుటుంబ దోపిడీకి గురయ్యాయన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని, వారు ఈ మారు మోసపోవడానికి ఏమాత్రమూ సిద్ధంగాలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ తన హామీలను ఎల్లప్పుడు నిలబెట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పలేదన్నారు. రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు, యువ వికాసం, మహాలక్ష్మీ, పింఛన్ల పథకాలు జనానికి మేలు చేసేవన్నారు. ఛత్తీస్ ఘడ్‌లో కోటి ఎకరాల భూమిని ఆదివాసులకు పంపిణీ చేశామన్నారు. 9.5 వేల కోట్ల నిధులను ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేశామన్నారు.
కానీ చత్తీస్‌ఘడ్ అభివృద్ధికి కేంద్రం నుండి ఆశించిన సహకారంలేదని అన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక వనరులను అభివృద్ధికి వినియోగించుకోవాలన్నది కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. మోడీ, కేసీఆర్ ఇద్దరిదీ ఒకే విధానమని, వారిద్దరూ అంతర్గత మితృలని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఇస్తాననన్న 3 ఎకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, విద్య, వైద్యం అన్ని హామీలు అటకెక్కాయని ఘాటుగా విమర్శలు చేశారు.
ప్రజలకు కాంగ్రెస్ అంటే నమ్మకమని, కర్ణాటకలో అదే విజయ రహస్యమని తెలియజేశారు. కర్ణాటక తరహా ఫలితాలే తెలంగాణాలో రానున్నాయన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి తమ ఆరు గ్యారంటీలపై ప్రభావం చూపబోదన్నారు. రైతులు, మహిళలకు వెచ్చించే నిధులు తిరిగి సమాజంలోనే వినియోగం అవుతాయని తెలిపారు. సాధారణ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. అటు సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ కేవలం నోటీసులతో సరిపెట్టడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధానికి నిదర్శనమన్నారు.
తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామంటున్నారని, ఆ కరెంటు తామే సప్లై చేస్తున్నామని అన్నారు. దానికి సంబంధించిన డబ్బులు ఇంకా కేసీఆర్ సర్కార్ బకాయిపడి ఉందని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అనీస్ అహ్మద్, AICC సభ్యులు అబ్బాస్, టీపీసీసీ కార్యదర్శి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.