Minister Botsa Satyanarayana : కిలోమీటరు పరిధిలోని పాఠశాలలు విలీనం, మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
Minister Botsa Satyanarayana : రాష్ట్రంలో కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలను మాత్రమే విలీనం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2వ తరగతి వరకూ ప్రాథమిక విద్యా అందిస్తామని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తామన్నారు.
Minister Botsa Satyanarayana : కిలోమీటరు పరిధిలో ఉన్న పాఠశాలలను మాత్రమే విలీనం చేయాలని ప్రతిపాదించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యతోపాటు, మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నూతన విద్యావిధానం ద్వారా పిల్లల్లో చిన్ననాటి నుంచే మానసిక వికాసాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా గరివిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1.28 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని సోమవారం మంత్రి బొత్స ప్రారంభించారు.
2వ తరగతి వరకు ప్రాథమిక విద్య
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్యం తమ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యతాంశాలని అన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా విద్యారంగంలో పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టితో ఆలోచించి, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెర తీశారని చెప్పారు. పిల్లల్లో చిన్నతనం నుంచే మనో వికాసాన్ని కల్పించే విధంగా విద్యావిధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. దీనికోసమే అంగన్‌వాడీ కేంద్రాలను, ప్రాథమిక పాఠశాలలను కలిపి, కార్పొరేట్ విద్యాలయాల్లో మాదిరిగా, ఎల్‌కేజీ, యూకేజీ తరహాలో చిన్నవయసు నుంచే 2వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అందించనున్నామని చెప్పారు.
ఆ తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం
3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నాడు-నేడు ద్వారా రూ.15 వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే మొదటి దశ నాడు-నేడు పనులు దాదాపు పూర్తి చేశామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు తమకు ఏ సమస్య ఉన్నా, చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానని మంత్రి ప్రకటించారు.
ఉద్యోగ సంఘాలతో చర్చలు
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి బొత్స అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. యూటీఎఫ్ నాయకులు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామనడం సబబుకాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీపీఎస్ పై కమిటీ వేశామని మంత్రి తెలిపారు. ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తుందన్నారు. ఈ కమిటీతో మళ్లీ సమావేశం కూడా నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయుల సెలవుల రద్దుపై టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ అవుతుందని తెలిపారు. సోమవారం సాయంత్రం మంత్రులు, జాయింట్ స్టాఫ్ కమిటీ సభ్యులతో సమావేశం అవుతామన్నారు. 16 ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించామని తెలిపారు.