Education: ఇకపై బీఎస్, ఎంఎస్‌గా మారనున్న యూజీ, పీజీ డిగ్రీలు
డిగ్రీ కోర్సులను బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకముందు వాటిస్థానంలో కేవలం బీఎస్, ఎంఎస్‌గా మారనున్నాయి.
దేశీయ విద్యావిధానంలో సమూలమార్పులకు కేంద్రం మరింత దూకుడుగా ముందుకెళ్తుంది. విదేశీ యూనివర్సిటీల స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు వారు ఎంచుకున్న సబ్జెక్టులను బట్టి ప్రస్తుతం డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకముందు వాటిస్థానంలో కేవలం బీఎస్, ఎంఎస్‌గా మారనున్నాయి. ఇప్పటివరకు ఈ తరహా పేర్లు అమెరికా తదితర దేశాల్లో ఉన్నాయి. ఇకపై మనదేశంలోనూ సబ్జెక్టు ఏదైనా యూజీ, పీజీ డిగ్రీలను బీఎస్, ఎంఎస్ అని పిలవనున్నారు.
భారత్‌లోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సుతో పాటు పీజీ కోర్సుకు ఆ పేర్లే అమలు చేయాలని యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ ఇటీవల సిఫారసు చేసింది. జాతీయ నూతన విద్యావిధానంలోనూ దీన్ని ప్రస్తావించినందున త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. దీనివల్ల బీఏ(ఎకనామిక్స్)ను కూడా ఇకముందు బీఎస్(ఎకనామిక్స్)గా పిలుస్తారు. అంటే ఇకముందు బీఏ, బీకాం, బీఎస్సీలు ఉండవు. కాకపోతే, ఈ విధానాన్ని నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకే అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2023-24)లో బీఎస్సీ ఆనర్స్ పేరిట నాలుగేళ్ల కోర్సు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు పలు దేశాల్లో బీఎస్ ఒక్కటే ఉంది. ఒకవేళ స్పెషలైజేషన్ అడిగితే బీఎస్ ఇన్ ఇంజినీరింగ్, బీఎస్ ఇన్ హిస్టరీ అని చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న విధానాన్ని ఇక్కడా అమలు చేయాలన్నది ఒక ఆలోచన కాగా.. జాతీయ నూతన విద్యావిధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే బహుళ సబ్జెక్టులను(మల్టీ డిసిప్లినరీ) ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ఒక విద్యార్థి హిస్టరీ, ఫిజికల్ సైన్స్, కామర్స్ కోర్సు్ ఎంపిక చేసుకుంటే దాన్ని ఏ డిగ్రీగా పిలవాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే అన్నిటికీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌గా.. అదీ గతంలో మాదిరిగా బీఎస్సీ అని కాకుండా బీఎస్‌గా మార్చాలని కమిటీ సూచించింది. పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీలను కూడా ఎంఎస్‌గా మార్చాలని సిఫారసు చేసింది. డిగ్రీలో మూడేళ్ల కోర్సులు ఇప్పుడున్న మాదిరిగానే ఉంచొచ్చని సూచించింది.
తెలంగాణ సానుకూలం..
ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే నాలుగేళ్ల కోర్సును రాష్ట్రంలో ప్రవేశపెట్టినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ వల్ల విదేశాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఇబ్బంది లేకుండా ఎంఎస్‌లో చేరవచ్చని.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడా బీఎస్‌గా మార్చే ఆలోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ALSO READ:
ఇకపై 22 భారతీయ భాషల్లో సీబీఎస్‌ఈ చదువులు - పుస్తకాల రూపకల్పన దిశగా ఎన్‌సీఈఆర్‌టీ
సీబీఎస్‌ఈ సిలబస్ పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. నూతన విద్యా విధానం అమలు మొదలు వైద్య, న్యాయ, ఇంజినీరింగ్ కోర్సులను భారతీయ భాషల్లో బోధించేందుకు ఏర్పాట్ల వరకు దేశ విద్యారంగం కొత్తరూపు సంతరించుకుంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..