TS EdCET 2023: మే 18న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష, ఆలస్యమైతే 'నో' ఎంట్రీ!
తెలంగాణలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే "టీఎస్ ఎడ్‌సెట్-2023" ప్రవేశ పరీక్షను గురువారం (మే 18) నిర్వహించనున్నారు. 31,725 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే "టీఎస్ ఎడ్‌సెట్-2023" ప్రవేశ పరీక్షను గురువారం (మే 18) నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్ పరీక్షలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 31,725 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఏపీలో ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించి, మే 21న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్ కీతోపాటు, ఫలితాలను విడుదల చేస్తారు.
మొదటి సెషన్‌ను ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, మూడో సెషన్‌ను సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో 10,565 మంది విద్యార్థులు, రెండో సెషన్‌లో 10,584 మంది, మూడో సెషన్‌లో 10,576 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఇక పరీక్షకు ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, అభ్యర్థులు పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరువాలని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ, కో కన్వీనర్ డాక్టర్ పి. శంకర్ సూచించారు. విద్యార్థులు కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని.. పరీక్షాకేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేసి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. విద్యార్థులు సొంత మాస్, గ్లౌజులు, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్‌ను, వాటర్ బాటిల్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు.
అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను 25 శాతం(38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
Also Read:
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు 4,94,620 మంది విద్యార్ధులు హాజరయ్యారు. పదోతరగతిలో మొత్తం 86.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. 88.53 శాతం బాలికలు పాస్ అయ్యారు. ఇక 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్‌లో నిలవడం విశేషం. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. 25 పాఠశాలల్లో 0 శాతం ఫలితాలు వచ్చాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు - రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ గడువు కూడా!
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించిన విషయం విదితమే. ఫెయిలైన విద్యార్థులు మే 16 వరకు సంబంధిత కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. అయితే ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మే 19 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..