TS EAMCET: ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి, 32 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ, ఎంతమంది సీట్లు పొందారంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో విడుత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఇందులో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడుతలో కొత్తగా 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో విడుత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఇందులో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడుతలో కొత్తగా 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇక 25,148 మంది విద్యార్థులు తమ సీట్లను మార్చుకున్నారు. రెండో విడత సీట్ల కేటాయింపుల తర్వాత 12,013 సీట్లు మిగిలాయి. నాలుగు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో మొత్తంగా 32 ఇంజినీరింగ్ కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.03 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 43.48 శాతం, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 60.02 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ సూచించారు. ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఆగస్టు 2లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ ఆర్డర్ పొందిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్‌కు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించి, సీటు కేటాయింపును ధ్రువీకరించుకోవాలి. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిది. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుంది. విద్యార్థులు జులై 22 లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు ఆగస్టు 9 నుంచి 11వ తేదీ మధ్యలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ ఆగస్టు 4: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
➥ ఆగస్టు 5: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్.
➥ ఆగస్టు 4 - ఆగస్టు 6 వరకు: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ ఆగస్టు 6: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
➥ ఆగస్టు 9: సీట్ల కేటాయింపు.
➥ ఆగస్టు 9 – ఆగస్టు 11: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ALSO READ:
టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..