TS EAMCET 2022 : టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక 'కీ' వచ్చేసింది, అభ్యంతరాలకు అవకాశం
అభ్యంతరాలకు ఆగస్టు 1 సాయంత్రం వరకు అవకాశంరెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోఆగస్టు 7 తర్వాత ఫలితాల వెల్లడి?
![TS EAMCET 2022 : టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక 'కీ' వచ్చేసింది, అభ్యంతరాలకు అవకాశం TS EAMCET 2022 answer key for engineering stream released, Candidates will be able to raise objections TS EAMCET 2022 : టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక 'కీ' వచ్చేసింది, అభ్యంతరాలకు అవకాశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/e537223d971d36cde2e71f192d86f0cc1659207630_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎంసెట్ ఇంజినీరింగ్ రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని అధికారులు జులై 30న విడుదల చేశారు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను సమర్పించేందుకు అవకాశం కల్పించినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. రెస్పాన్స్ షీట్లు, కీని వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు జులై 20న ముగిసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించారు. మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. 9శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు.
TS EAMCET 2022 - Preliminary Keys
ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆగస్టు 7 లేదా 8వ తేదీల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జులై 14, 15న జరగాల్సిన అగ్రికల్చర్ ఎంసెట్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను జులై 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత రెండింటి ఫలితాలను ఒకేసారి వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆగస్టు 7 తర్వాతే ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అభ్యంతరాలను తెలియజేయండిలా:
- అభ్యంతరాలు మొదటగా https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_kEY_OBJ_TERMS.aspx లింక్ పై క్లిక్ చేయాలి.
- అభ్యంతరాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. అక్కడ Continue బటన్‌పై క్లి్క్ చేయాలి.
- అలా క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన రోజు వివరాలతో కూడిన విండో ఓపెన్ అవుతుంది. ఆ వివరాలు నమోదు చేసి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- అనంతరం విద్యార్థులు అభ్యంతరాలను తెలపొచ్చు.
- అభ్యర్థులు మాస్టర్ క్వశ్చన్ పేపర్‌లో ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకొని మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. అభ్యర్థి తన రెస్పాన్స్ షీట్ ఆధారంగానే "క్వశ్చన్ ఐడీ"ని మ్యాప్ చేయాల్సి ఉంటుంది.
- మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన రోజు మరియు ఇచ్చిన సెషన్ వివరాల ఆధారంగా అభ్యంతరాలు నమోదుచేయాలి.
- అభ్యర్థులు ఎన్ని ప్రశ్నలకైనా అభ్యంతరాలు తెలపవచ్చు. కాని ఒకేసారి తెలపాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు గల కారణాలను కూడా నమోదుచేయాల్సి ఉంటుంది.
- సరైన కారణాలు లేని అభ్యంతరాలు రిజక్ట్ చేస్తారు. అభ్యంతరాలనికి సంబంధించిన కారణాన్ని పీడీఎఫ్ లేదా జేపీఈజీ(jpeg) ఫార్మాట్‌లో జతచేయాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు తెలపడానికి మరే ఇతర విధానాలు లేవు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)