Degree Admissions: 'దోస్త్'లకు మూడో విడత సీట్ల కేటాయింపు- 72949 మందికి ప్రవేశాలు! కామర్స్ కోర్సుకే డిమాండ్!
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన 'దోస్త్' మూడో విడత సీట్లను అధికారులు కేటాయించారు. మూడో విడతలో మొత్తం 72,949 మందికి ఉన్నతవిద్యామండలి సీట్లను కేటాయించింది.
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన 'దోస్త్' మూడో విడత సీట్లను అధికారులు కేటాయించారు. రెండో విడతలో మొత్తం 49,267 మందికి సీట్లను కేటాయించగా.. మూడో విడతలో 72,949 మందికి గురువారం (జులై 20న) సీట్లను కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మూడో విడత సీట్ల కేటాయింపులోనూ కామర్స్ కోర్సుకే విద్యార్థులు ఆసక్తి చూపారు. మూడో విడతలో సీటు పొందిన అభ్యర్థులు జులై 22 నుండి 25 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మూడో విడతలో సీట్లు పొందినవారిలో 10,939 మంది ఆర్ట్స్ కోర్సును ఎంచుకోగా.. 32,209 మంది కామర్స్ కోర్సును ఎంచుకున్నారు. ఇక లైఫ్ సైన్స్ కోర్సును 16,859 మంది, ఫిజికల్ సైన్సెస్ కోర్సును 12,620 మంది ఎంచుకున్నారు. డిఫార్మసీ సీట్లు పొందిన వారు కేవలం 235 మంది మాత్రమే ఉన్నారు. ఇతర కోర్సులను ఎంచుకున్న వారు 87 మంది ఉన్నారు.
'దోస్త్' మూడు రౌండ్ల సీట్లకేటాయింపు వివరాలు పరిశీలిస్తే.. మొత్తంగా 1,95,436 మంది విద్యార్థులకు అధికారులు సీట్లను కేటాయించారు. మొదటి విడతలో 73,220, రెండో విడతలో 49,267, మూడో విడతలో 72949 మందికి సీట్లు పొందారు. అయితే వీరిలో మొదటి విడతలో సీటు పొందినవారు.. రెండో విడతకు, రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్‌లో ఉత్తమ కాలేజీ, కోర్సు కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో మొత్తం ఎన్ని సీట్లు భర్తీ అయినాయి తెలియాలంటే తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది.
ఆగస్టు 1 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్..
'దోస్త్' స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులకు ఆగస్టు 16న సీట్లను కేటాయించనున్నారు.
ALSO READ:
ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే చివరి అవకాశం!
ఏపీలోని జూనియర్ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. 2023-24 ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఆగస్టు 17తో ముగియనుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందడానికి ఇదే చివరి విడత అని.. మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మే 15 నుంచి జూన్ 14 వరకు మొదటి విడత ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. జూన్ 14తో మొదటి విడత ప్రవేశాలు, జులై 15 వరకు రెండో విడత ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం చివరి విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జులై 21, 22 తేదీల్లో 'అగ్రికల్చర్' ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణ, ఈ సర్టిఫికేట్లు ఉన్నాయా?
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు జులై 21 , 22 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవయసాయ విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు బుధవారం (జులై 19) కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికిగాను రెండేళ్ల వ్యవసాయ, సేంద్రీయ డిప్లొమా కోర్సుతోపాటు మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం. వెంకటరమణ తెలిపారు. షెడ్యూల్‌ను చూసి విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial