TS DEECET 2021: తెలంగాణ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. వచ్చే నెల 8న ఎగ్జామ్
TS DEECET: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు టీచర్ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) -2021 నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా డీఈఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీపీఎస్ఈ (డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సుల కాల వ్యవధి రెండేళ్ల పాటు ఉంటుంది.
50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా (CBT) ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం http://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
8న ప్రవేశ పరీక్ష..
2021 సెప్టెంబర్ 1 నాటికి కనీసం 17 సంవత్సరాల వయసున్న వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీనికి గరిష్ట వయో పరిమితి లేదని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఇక టీఎస్ డీఈఈసెట్ పరీక్షను సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 15వ తేదీన వెల్లడించనున్నారు.
పరీక్ష విధానం..
టీఎస్ డీఈఈసెట్ పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో ఉండనుంది. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంది. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో జనరల్ ఇంగ్లిష్, టీచింగ్ ఆప్టిట్యూట్ (10 ప్రశ్నలు) ప్రశ్నలు ఉంటాయి.
రెండో విభాగం 30 మార్కులకు ఉంటుంది. ఎంచుకున్న భాషను బట్టి విభాగాలు మారతాయి. తెలుగు భాష ఎంచుకున్న వారికి జనరల్ ఇంగ్లిష్ (10 మార్కులు), జనరల్ తెలుగు (20 మార్కులు) ఉంటాయి. ఉర్దూ ఎంచుకున్న వారికి జనరల్ ఇంగ్లిష్ (10 మార్కులు), జనరల్ ఉర్దూ (20 మార్కులు) కేటాయించారు. ఇంగ్లిష్ ఎంచుకున్న వారికి జనరల్ ఇంగ్లిష్ (20 మార్కులు), జనరల్ తెలుగు / ఉర్దూ (10 మార్కులు) ఉంటాయి.
మూడో విభాగంలో మెథమెటిక్స్ (20 మార్కులు), ఫిజికల్ సైన్స్ (10 మార్కులు), బయోలాజికల్ సైన్సెస్ (10 మార్కులు), సోషల్ స్టడీస్ (20 మార్కులు) కేటాయించారు.
Also Read: NEET PG 2021: నీట్ పీజీ రిజిస్ట్రేషన్లకు ఓకే.. అభ్యర్థులకు ఆగస్టు 20 వరకు అవకాశం