(Source: ECI/ABP News/ABP Majha)
TG ECET Counselling: తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు నిర్వహించిన టీఎస్ ఈసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
Telangana ECET 2024 Counselling Schedule: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు నిర్వహించిన టీఎస్ ఈసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 24న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రవేశ కమిటీల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ కోసం అవకాశం కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయినవారికి జూన్ 10 నుంచి 12 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్నవారు జూన్ 10 నుంచి 14 మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 18లోపు సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 18 - 21 మధ్య నిర్ణీత ఫీజు చెల్లించి, సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
TG ECET - 2024 కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్: జూన్ 8 నుంచి 11 వరకు
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: జూన్ 10 నుంచి 12 వరకు
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 10 నుంచి 14 వరకు
➥ సీట్ల కేటాయింపు: జూన్ 18లోపు
➥ సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు: జూన్ 18 - 21 వరకు
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మే 20న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 95.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 6న మొత్తం 99 కేంద్రాల‌్లో ఈసెట్ పరీక్ష నిర్వహించింది. ఇందులో తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44, ఏపీలో 7 పరీక్షా కేంద్రాల‌్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహించారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు). ఈ పరీక్ష కోసం మొత్తం 24,272 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 23,330 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 22,365 మంది ఉత్తీర్ణులయ్యారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆలస్యరుసుములో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మే 6న పరీక్ష నిర్వహించి, ఫలితాలను మే 20న విడుదల చేశారు. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది.