TSCHE CETs: ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలివే! సంక్రాంతి తర్వాతే తేదీల వెల్లడి!
తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండలి నియమించింది.
తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంసెట్ సహా మరో 6 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లను నిర్వహించే వర్సిటీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండలి నియమించింది. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్, టీఎస్ పీజీఈసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూహెచ్‌కు అప్పగించింది. టీఎస్ ఐసెట్ - కాకతీయ యూనివర్సిటీకి, టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్, ఈసెట్ - ఉస్మానియా యూనివర్సిటీ, టీఎస్ ఎడ్‌సెట్ - మహాత్మా గాంధీ యూనివర్సిటీ, టీఎస్ పీఈసెట్ - శాతవాహన యూనివర్సిటీకి అప్పగించారు.
ఎంసెట్ కన్వీనర్‌గా డీన్‌కుమార్..
ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న ప్రొఫెసర్ బి. డీన్ కుమార్‌ను నియమించారు. గత మూడేళ్లుగా ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, రెక్టార్ గోవర్ధన్ కొనసాగగా.. ఈసారి డీన్ కుమార్‌ను నియమించారు. ఈయన గతంలో పరీక్షల నియంత్రణ విభాగం కంట్రోలర్‌గా, చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశారు. ఈసారి కొత్తగా ఐసెట్, లాసెట్ కన్వీనర్లుగా మహిళలు రావడం విశేషం.
ఇప్పటివరకు ఈసెట్‌ను జేఎన్‌టీయూహెచ్ నిర్వహించగా.. ఈసారి దాన్ని ఓయూకు అప్పగించారు. ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఇంజినీరింగ్ సెట్‌ను ఓయూ నుంచి తొలగించి జేఎన్టీయూహెచ్‌కు కేటాయించారు. అంతేకాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్(పీఈసెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నుంచి తొలగించి, కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీకి అప్పగించారు.
ఇప్పటివరకు ఓయూ చేతులో ఉన్న ఎడ్‌సెట్(బీఈడీ సీట్ల భర్తీకి)ను మహాత్మాగాంధీ వర్సిటీకి కేటాయించారు. ఎంసెట్, ఐసెట్, లాసెట్‌లను గతంలో చేపట్టిన యూనివర్సిటీలే నిర్వహిస్తాయి. ఎడ్‌సెట్, పీఈసెట్‌లను ఇతర వర్సిటీలకు కేటాయించినా కన్వీనర్లు మాత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులే ఉంటారు. ఎడ్‌సెట్‌కు గత ఏడాది కన్వీనర్‌గా వ్యవహరించిన రామకృష్ణ ఈ ఏడాది కూడా కొనసాగనున్నారు.
ప్రవేశ పరీక్ష | కన్వీనర్ | యూనివర్సిటీ |
టీఎస్ ఎంసెట్ | ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ | జేఎన్టీయూ-హైదరాబాద్ |
టీఎస్ పీజీ ఈసెట్ | ప్రొఫెసర్ బి. రవీంద్ర రెడ్డి | జేఎన్టీయూ-హైదరాబాద్ |
టీఎస్ ఐసెట్ | ప్రొఫెసర్ పి. వరలక్ష్మి | కాకతీయ యూనివర్సిటీ |
టీఎస్ ఈసెట్ | ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ | ఉస్మానియా యూనివర్సిటీ |
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ | ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి | ఉస్మానియా యూనివర్సిటీ |
టీఎస్ ఎడ్‌సెట్ | ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ | మహాత్మా గాంధీ యూనివర్సిటీ |
టీఎస్ పీఈసెట్ | ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ | శాతవాహన యూనివర్సిటీ |
సంక్రాంతి తర్వాత పరీక్షల తేదీల వెల్లడి
ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి 29తో ముగియనున్నాయి. ఆ తర్వాత 30 నుంచి 45 రోజుల సమయం ఇచ్చి ఎంసెట్‌ను నిర్వహించడం ఆనవాయితీ. ఆ ప్రకారం మే నెల మధ్యలోనే జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. మే 7న నీట్, జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఉన్నాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఎంసెట్ తేదీలను నిర్ణయిస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. తొలుత పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు రాసే ఈసెట్‌ను జరుపుతారు. ఇక మిగిలినవి డిగ్రీ పూర్తయిన వారే రాస్తారు. డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షల తేదీలతో పాటు ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించిన టీసీఎస్ అయాన్ డిజిటల్ ప్రతినిధులతో చర్చించి సంక్రాంతి తర్వాత తేదీలను వెల్లడిస్తామని ఆయన వివరించారు. మొత్తానికి ఈసెట్, ఎంసెట్ పరీక్షలను మే నెలలోనే నిర్వహించనున్నారు.
Also Read:
నీట్ పీజీ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, అప్లికేషన్ లింక్ ఇదే!
నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ జనవరి 7న ప్రారంభించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 27 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం (ఫొటో, సంతకం, వేలిముద్ర మార్పు) ఇవ్వనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. మార్చి 5న పరీక్ష నిర్వహించి, 31న ఫలితాలు వెల్లడించనున్నారు. నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు, ఫీజు వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు.
మాక్ టెస్ట్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..