Junior Colleges: జూనియర్ కాలేజీలకు ముగిసిన వేసవి సెలవులు, ప్రారంభమైన ఇంటర్ తరగతులు
Telnagana Junior Colleges: తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు.
Inter Classes in Telnagana: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు మే 31తో ముగియడంతో.. నేటి(జూన్ 1) నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. తెలంగాణలో ఇంటర్ మొదటిదశ ప్రవేశాల ప్రక్రియ మే 9న ప్రారంభమై.. మే 31తో ముగిసింది. జూన్ 30 నాటికి మొదటిదశ ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. మొదటిదశ ప్రవేశాలు పూర్తికాగానే.. రెండోదశ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. మరోవైపు ఏపీలో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకాగా.. జూన్ 1 వరకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. కళాశాలల రీఓపెనింగ్‌కు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇంటర్ అధికారులు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మొదటివారమంతా.. ప్రభుత్వ, గురుకుల కాలేజీలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో హాజరుశాతం తక్కువగానే ఉండనుంది. జూన్ రెండోవారం నుంచి విద్యా్ర్థుల సంఖ్య పెరిగే అవకాశముంది.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో జూన్ చివరి వరకూ క్లాసులు జరిగే అవకాశం లేదు. మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే దాదాపు ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యింది. రెండో సంవత్సరం క్లాసులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. మొదటి సంవత్సరం తరగతులు కూడా అనధికారికంగానే నడుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3 వేలకుపైగానే జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 422 వరకు ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఇక గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు తీసేస్తే 1400 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటన్నింటికీ ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఇప్పటికే చాలావరకు గుర్తింపు ప్రక్రియ పూర్తికాగా.. సరైన డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా ఇంకా 600 ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు దక్కలేదు. అనుమతి రాకముందే.. ఆయా కాలేజీలు ప కొనసాగించినట్టు తెలుస్తోంది. ఒక్కో కాలేజీ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 72వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులుంటే, ప్రైవేటు కాలేజీల్లో 2.35 లక్షల మంది ఉన్నారు. ఆఖరిదశ వరకూ అప్లియేషన్ల ప్రక్రియ కొనసాగించడం వల్ల ప్రతీ సంవత్సరం విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..
లెక్చరర్ల కొరత..
ఇంటర్ తరగతులు ప్రారంభమవుతున్నా.. ఇప్పటివరకు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను రెన్యువల్ ప్రక్రియ చేయనేలేదు. ఇప్పటి వరకు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను రెన్యువల్ చేయలేదు. కనీసం రెన్యువల్‌కు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు కూడా పంపలేదని తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రెన్యువల్ సాధ్యం కాదనే ఆలోచనతో అధికారులు దీనిని పట్టించుకోలేదు. మరోవైపు ఇతర శాఖలు మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులను రెన్యువల్ చేసుకున్నాయి. మిగిలిన శాఖల సంగతి ఎలావున్నా.. ఇంటర్‌లో కాంట్రాక్టు లెక్చరర్లు కీలకం. 470 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ జేఎల్స్ 900 మంది పనిచేస్తుంటే, కాంట్రాక్టు జేఎల్స్ 3,600 మంది ఉన్నారు. మరో 1,030 మంది గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అంటే కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీ లేకపోతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నడపడం వీలుకాదు. అలాంటి కీలకమైన జూనియర్ కాలేజీల విషయంలో ఇంటర్ విద్యాశాఖ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.