Inter Exams: ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Inter Exams: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రభుత్వం ఖరారుచేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నీరు.
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రభుత్వం ఖరారుచేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నీరు. ఇక ఇంటర్ ప్రీ-ఫైనల్ పరీక్షలను జనవరిలో, ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం (డిసెంబరు 27) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనుంది. వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్‌తో కూడిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు.
ఉదయం 9 గంటల నుంచే...
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలను ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒకరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మరోరోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లిష్ థియరీ పేపర్‌ను 80 మార్కులకే నిర్వహిస్తారు. 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు
తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒక ఇంటర్నల్ పరీక్షను రద్దు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను తొలగిస్తున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అయితే మరో ఇంటర్నల్ అయిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వంద మార్కుల ఈ ఇంటర్నల్ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి, అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాగా, ఈ మార్కులను రెగ్యులర్ మార్కుల్లో కలపరు.
ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేక బుక్
ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేకంగా 90 పేజీలతో కూడిన ‘ఏ హ్యాండ్‌బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-1’ పేరిట ప్రత్యేక సిలబస్‌తో ఇంటర్మీడియట్ బోర్డు కొత్త పుస్తకాన్ని రూపొందించింది. ఆ పుస్తకాలు ముద్రణను పూర్తిచేసుకొని జూనియర్ కళాశాలలకు చేరాయి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ సెకండియర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు, వొకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించి, ఆ సిలబస్‌కు అనుగుణంగా విద్యాసంవత్సరం పొడవునా విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ను చేయించడం అన్నది ఈ కొత్త విధానంలో ప్రధానాంశం.
ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్ అమలుచేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు.