Intermediate Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం... వచ్చే ఏప్రిల్ లో మరోసారి ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మరోసారి పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చింది.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిలైన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన విద్యార్థులకు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. గురువారం ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసైయ్యారు. దీంతో వివాదం నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని బోర్డు అధికారులు తెలిపారు. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చన్నారు. పరీక్షల్లో సిలబస్ 70 శాతానికి తగ్గించామని, ఛాయిస్ కూడా ఇచ్చామని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు ఆందోళనలు
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిలవడం వివాదాస్పదంగా మారింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలు ప్రారంభించారు. గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ సారి 49 శాతానికే పరిమితమయింది. కరోనా టైమ్‌లో విద్యార్ధులు ఎన్నో ఇబ్బందులు పడి పరీక్షలు రాస్తే.. మరీ ఇంత తక్కువ మందిని పాస్ చేస్తారా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ కఠినంగా చేశారనీ బాగా చదివే పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల రోజులే టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టారని ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.
తగ్గిన ఉత్తీర్ణత
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది పాస్ అయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ సంవత్సరం 11 శాతం తగ్గింది. గురువారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా http://results.cgg.gov.in లేదా http://examresults.ts.nic.in ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,59,242 విద్యార్థులు హాజరయ్యారు.