(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Inter: ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ ఖరారు.. పరీక్షలు, సెలవులు ఈ తేదీల్లో..
కరోనా నేపథ్యంలో వివిధ కోర్సులకు ఇలా విద్యా సంవత్సరం ప్రకటించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వివిధ కోర్సులకు ఇలా విద్యా సంవత్సరం ప్రకటించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. ఆన్‌లైన్ తరగతులతో కలిపి మొత్తం 220 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు సెలవులు ఇచ్చింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అర్ధ సంవత్సర (హాఫ్ ఇయర్లీ పరీక్షలు), ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ముఖ్యమైన తేదీలు ఇవీ..
కొత్తగా ప్రకటించిన ఇంటర్ విద్యా సంవత్సరంలో భాగంగా డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు జరపాలి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 23 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు ఉండనున్నాయి. మళ్లీ జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం అవుతాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరికీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ జారీ చేశారు. ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ మాట్లాడుతూ.. అందరూ అకడమిక్ క్యాలెండర్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. దీనిని ఉల్లంఘించిన ప్రిన్సిపల్స్, కాలేజీ మేనేజ్‌మెంట్‌లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు ఇతర చర్యలు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాధారణ అకడమిక్ క్యాలెండర్ ఇలా..
తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పనిదినాలు ఉంటాయని తెలిపింది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1కి ముందు నిర్వహించిన 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఇక దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి 17 వరకు ఉంటాయని వెల్లడించింది.
క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లో చదివే వారికి క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 28 వరకు ఉంటాయని తెలిపింది. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి. వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా దేశంలో పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి.