TS EAMCET Exam Date 2021: ఈ నెల 4 నుంచి ఎంసెట్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 4 (ఎల్లుండి) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉందని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4 నుంచి ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. తెలంగాణలో 82, ఆంధ్రప్రదేశ్ లో 23 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉందని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు. రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తామని వివరించారు. హాల్ టికెట్లపై పరీక్ష కేంద్రం లొకేషన్ ఉంటుందని చెప్పారు. ఒక రోజు ముందుగానే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని సూచించారు.
ఇంటర్ సిలబస్‌కు వెయిటేజి లేదు..
ఎంసెట్ పరీక్షకు గతంలో ఇంటర్ సిలబస్ వెయిటేజి ఉండేదని కానీ ఈ ఏడాది వెయిటేజీ తొలగించినట్లు గోవర్ధన్ తెలిపారు. కొవిడ్19 కారణంగా ఇబ్బందులు పడిన విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇస్తామని.. అందులో వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందే..
ప్రతి ఒక్క విద్యార్థి కొవిడ్19 నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. వారికి పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఈసారి ఎంసెట్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రశ్నపత్రాలను సైతం సిద్ధం చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీల వివరాలు..
ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ పరీక్షలు..
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగాలకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు ఆగస్లు 9, 10 తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో జరగనున్నాయి. లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను సైతం ఆగస్టు 23న నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ (AP EAPCET ) పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ఆగస్టులో టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు.. ముఖ్యమైన తేదీలివే..