Skill Development Courses: 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం
వచ్చే విద్యాసంవత్సరంలో 100 డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Skill Development Courses in Degree Colleges: తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 100 డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సెక్టార్ స్కిల్ కౌన్సిళ్లు, కళాశాల విద్యాశాఖ, వర్సిటీల అధికారులతో ఫిబ్రవరి 17న నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చదువుతూనే విద్యార్థులకు సంపాదించుకునే వెసులుబాటు కల్పించేలా తీర్చిదిద్దనున్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో 30 డిగ్రీ కాలేజీల్లోనే 36 కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ సంఖ్యను 100కు పెంచాలని నిర్ణయించారు. ఏయే రంగాల్లో ఏ కోర్సులను ప్రవేశపెట్టవచ్చో గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రాల్లోని విద్యార్థులు అధికంగా ఉన్న కాలేజీల్లో ఈ కోర్సులకు ప్రవేశపెడతారు. ప్రైవేట్ కాలేజీలకు సైతం అవకాశం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్య మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ మాట్లాడుతూ.. డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయమన్నారు.
దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది.
కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు.
కోర్సులు ఇవే..
అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి.
తెలంగాణలో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.