OU TV Channel: విద్యార్థులకు గుడ్ న్యూస్, త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ టీవీ ఛానల్ - దేశంలోనే తొలిసారి!
త్వరలో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. డీటీహెచ్‌లో ఉచితంగా ఈ ఛానల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. శాటిలైట్ లింక్‌లు, ఛానల్ నంబరు ప్రసారాలపై వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒక్కటైనా ఉస్మానియా యూనివర్సిటీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. డీటీహెచ్‌లో ఉచితంగా ఈ ఛానల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. శాటిలైట్ లింక్‌లు, ఛానల్ నంబరు ప్రసారాలపై వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త ఛానల్‌ను 'ఉస్మానియా యూనివ్' పేరిట అందుబాటులోకి తేనుంది.
యూనివర్సిటీ పరిధిలో నిత్యం ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, మంచి పేరున్న ఫ్రొఫెసర్లు గెస్ట్ ఫ్యాకల్టీలుగా వచ్చి ఉపన్యాసాలు ఇస్తుంటారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, ఉద్యోగ, విద్య సమాచారం, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను టీవీ ఛానల్‌లో ప్రసారం చేయవచ్చని వర్సిటీ అధికారులు యోచిస్తున్నారు. దేశంలో ఒక యూనివర్సిటీకి టీవీ ఛానల్ అనేది ఎక్కడా లేదు. తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ ప్రయోగానికి తెరలేపింది.
ఇందులకోసం ప్రత్యేక డైరెక్టరేట్..
ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొ.డి.రవీందర్ వచ్చాక కొత్తగా వివిధ డైరెక్టరేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డైరెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏర్పాటు కానుంది.
ఇప్పటికే డిజిటల్ వైపు పయనం..
ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా మరో కీలక ముందడుగు వేసింది. పరీక్షల విభాగం ఆటోమేషన్ చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. దశాబ్దాలుగా ఉన్న రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ధ్రువపత్రాన్ని పరిశీలించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. 1930కి చెందిన రికార్డు కావడంతో సేకరించడం ఇబ్బందిగా మారింది. దీనికితోడు అప్పటి ధ్రువపత్రాలన్నీ ఉర్దూలో ఉన్నాయి. ఎట్టకేలకు వెతికి పట్టుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయ రికార్డులన్నీ పరీక్షల విభాగంలో జాగ్రత్తగా పొందుపరిచారు. లక్షల సంఖ్యలో ఉన్న రికార్డుల్లో.. అవసరమైన పత్రాలను భౌతికంగా వెతికి తీసుకోవడం కష్టమవుతోంది. ఇప్పటివరకు ఓయూ పరీక్షల విభాగంలో 2009 తర్వాత రికార్డులు, ధ్రువపత్రాలే డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మిగతావీ కంప్యూటరీకరించేందుకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే డిగ్రీ, పీజీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. ఏటా వర్సిటీ పరిధిలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. ఆన్‌స్క్రీన్ మూల్యాంకనంలో భాగంగా జవాబు పత్రాలన్నీ స్కాన్ చేసి కంప్యూటరీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులకు పంపించి దిద్దిస్తున్నారు. ఏ జవాబుపత్రం ఎవరు దిద్దుతున్నారో బయటకు తెలియదు. ధ్రువపత్రాలు పొందేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఓయూ తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని విభాగాలకే పరిమితమైంది.త్వరలో పూర్తిస్థాయిలో సేవలందించేలా తీర్చిదిద్దుతున్నారు. ధ్రువపత్రాల జారీ నుంచి, పాత రికార్డులన్నీ జూన్ కల్లా డిజిటలైజ్ కానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.బి.నగేశ్ తెలిపారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలన్నది లక్ష్యం.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీచర్ కూడా...
నకిలీ సర్టిఫికేట్లను తక్షణమే కనిపెట్టే Student Academic Verification Service పేరుతో సాంకేతికపరమైన సర్వీసును ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ‘ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు లింక్ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం అందనుంది. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం అందజేస్తారు. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్ బోర్డులను చేర్చే అంశాన్ని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.