NEET UG Result 2024: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్, సత్తాచాటిన ఏపీ విద్యార్థులు - ఏకంగా నలుగురికి 1వ ర్యాంకు
NEET UG 2024: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఫైనల్ కీని కూడా ఎన్టీఏ విడుదల చేసింది.
NEET UG 2024 Results: నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జూన్ 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. నీట్ ఫలితాలతోపాటు తుది కీని కూడా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు 24,06,079 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 23,33,297 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారిలో 13,16,268 మంది అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 5,47,036 మంది బాలురు; 7,69,222 మంది బాలికలు ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ విద్యార్థులు 10 మంది అర్హత సాధించారు. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష కోసం ఏపీ నుంచి 66,522 మంది దరఖాస్తు చేసుకోగా.. 64,931 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 43,858 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇక తెలంగాణ నుంచి 79,813 మంది దరఖాస్తు చేసుకోగా.. 77,849 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,371మంది విద్యార్థులు అర్హత సాధించారు.
నీట్ ఫలితాల్లో సత్తాచాటిన ఏపీ విద్యార్థులు..
ఫలితాల్లో టాప్-100 ర్యాంకుల్లో మొత్తం 66 మంది విద్యార్థులు 99.997129 పర్సంటైల్‌తో మొదటి ర్యాంకులో నిలిచారు. ఇందులో ఏపీకి చెందిన కస్తూరి సందీప్ 21వ స్థానంలో, గట్టు భానుతేజ సాయి 28వ స్థానంలో పోరెడ్డి పవన్ కుమార్ రెడ్డి 56వ స్థానంలో, వడ్లపూడి ముఖేశ్ చౌదరి 60వ స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణకు చెందిన అనురన్ ఘోష్ 99.996614 పర్సంటైల్‌తో 77 ర్యాంకు సాధించాడు. మొత్తంగా చూస్తే టాప్-100 లో 5 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
నీట్ యూజీ 2024 స్కోరు కార్డు కోసం క్లిక్ చేయండి..
నీట్ యూజీ 2024 తుది ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను మే 5న నిర్వహించారు.పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షల నిర్వహించారు. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే. మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.
నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా మొత్తం 24,06,079 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10.29 లక్షల బాలురు ఉన్నారు. వీరిలో 9,98,298 లక్షల మంది పరీక్షకు హాజరుకాగా.. 5.47 లక్షల మంది అర్హత సాధించారు. ఇక 13.76 లక్షల బాలికలు దరఖాస్తు చేసుకోగా.. 13.34 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1.5 లక్షల మంది ఉండగా.. ఏపీ నుంచి 70 వేలు, తెలంగాణ నుంచి 80 వేల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఏపీలో 29 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు.
నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 29న విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను (రెస్పాన్స్ షీట్) అందుబాటులో ఉంచి, ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు మే 31 వరకు అవకాశం కల్పించింది.
నీట్ యూజీ పరీక్షలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలిటికల్ టూల్‌ను వినియోగించారు. ఇది విద్యార్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తిస్తుంది. నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.