CUET: తెలుగు రాష్ట్రాల్లో 'సీయూఈటీ' హెల్ప్ సెంటర్లు, ఎన్నంటే?
సీయూఈటీ-2023 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సహకరించేందుకు ఎన్‌టీఏ ఈసారి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీలో 3, తెలంగాణలో ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ)-2023కు దరఖాస్తు చేసే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సహకరించేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఈసారి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాలకు వెళ్తే ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయడానికి సహకరించడంతోపాటు సందేహాలను అక్కడి సిబ్బంది నివృత్తి చేస్తారు. దేశవ్యాప్తంగా 24 హెల్ప్‌లైన్ సెంటర్లు నెలకొల్పగా.. అందులో తెలంగాణలో ఒకటి, ఏపీలో మూడు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇక ఏపీలో గన్నవరం మండలం నున్నలోని పాలడుగు పార్వతీదేవి ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలులోని ఎస్‌డీఆర్ హైస్కూల్, తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీయూఈటీ దరఖాస్తు గడువు మార్చి 12 వరకు కొనసాగనుండగా.. మే 21 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 547 నగరాల్లో, దేశం ఆవల 13 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 560 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 2న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరొచ్చు. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తెలిపింది. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపిం మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించవచ్చు. మేలో ప్రవేశ పరీక్ష జరుగనుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు ఈ ఏడాది మే 21 నుంచి మే 31 వరకు జరగనున్నాయి. జూన్ మూడో వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. గతేడాది మాదిరిగానే 13 భాషల్లో సీయూఈటీ యూజీ 2023 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.
సీయూఈటీ పరీక్ష విధానం, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు..
➸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.02.2023.
➸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.03.2023 (రాత్రి 09:00 వరకు)
➸ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 12.03.2023 (రాత్రి 11:50 వరకు)
➸ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్: 15.03. 2023 - 18.03.2023 (రాత్రి 11:50 వరకు)
➸ పరీక్ష కేంద్రాల ప్రకటన: 30.04.2023.
➸ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2023.
➸ పరీక్ష ప్రారంభతేదీ: మే 21 నుండి మే 31, 2023 వరకు
➸ ఫలితాల ప్రకటన: తర్వాత ప్రకటిస్తారు.