Medical PG Seats: కొత్త మెడికల్ కాలేజీల కన్వీనర్ కోటా పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు
తెలంగాణలో 2014 జూన్ 2 తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా పీజీ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి.
తెలంగాణలో 2014 జూన్ 2 తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా పీజీ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ జులై 29న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 117 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో 50 శాతం పీజీ మెడికల్ సీట్లు ఆలిండియా కోటా కింద జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో భర్తీ కానుండగా.. మిగిలిన 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయిస్తారు. వీటితో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్లలో 50 శాతం కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ రెండింటికీ కాళోజీ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేయనుంది.
గతేడాది వరకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే పీజీ సీట్లలో 15 శాతం సీట్లకు తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడేవారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో 2014 జూన్ 2కు ముందు ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించనున్నారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. విభజన అనంతరం పదేళ్లపాటు ఎంబీబీఎస్, మెడికల్ పీజీ కన్వీనర్ కోటా సీట్లలో 15 శాతం సీట్ల కోసం తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడేలా నిబంధనలున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఈ నిబంధనను రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉన్న మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కూడా ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. తాజాగా పీజీ మెడికల్ సీట్ల భర్తీ నిబంధనల్లో తెలంగాణ మార్పులు చేసింది.
2014 జూన్ 2 నాటికి తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు 515. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు 668 గా ఉండేది. 2014 జూన్ 2 తర్వాత నెలకొల్పిన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అదనంగా వచ్చిన పీజీ సీట్లు 755. ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులోకి వచ్చినవి 808 ఉన్నాయి. దీంతో మొత్తం 1563 సీట్లలో కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యేవి 781. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇందులో 15 శాతం కోటా కింద తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అదనంగా 117 సీట్లు దక్కనున్నాయి.
ALSO READ:
ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన 44,629 మంది అర్హత పొందారు. వీరిలో 22,167 మంది కన్వీనర్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 15,016 అమ్మాయిలు ఉండగా 7,151 మంది అబ్బాయిలు ఉన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నాలుగు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆల్‌ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేవారు రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..