NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
NEET UG 2024 Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
NEET UG 2024 Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జులై 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ లేదా మొబైల్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. నీట్ యూజీ రీఎగ్జామ్‌కు సంబంధించిన ఆన్సర్ కీని ఎన్టీఏ జూన్ 30న విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని పొందుపరిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 1563 అభ్యర్థులకు నీట్ యూజీ రీఎగ్జామ్ నిర్వహించగా కేవలం 813 మంది (52 శాతం) మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 48 శాతం మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు మినహాయించి ఒరిజినల్ స్కోర్లను ఎంచుకున్నారు. అయితే ఈ సారి పరీక్షరాసిన 813 మందిలో ఒక్కరికి కూడా 720/720 మార్కులు సాధించలేకపోయారు. దీంతో నీట్ టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి పడిపోయింది.
నీట్ యూజీ 2024 పరీక్షను మే 5న నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 24 లక్షల మంది వరకు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్ 4న ఎన్టీఏ విడుదల చేసింది. ఫలితాల్లో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు. ఇందులో ఆరుగురు హర్యానాలోని ఝజ్జర్ కేంద్రానికి చెందినవారే ఉండటం.. వివాదాలకు తెరతీసింది. పేపర్ లీకయ్యిందని, అందుకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఒకే ర్యాంకు సాధించారని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర విద్యాశాఖ ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు.
నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
నీట్ యూజీ ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
నీట్ యూజీ పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరడంతో..గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం కోర్టుకు వెల్లడించింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఆ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయడం ఆసక్తిలేని విద్యార్థులు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని కేంద్రం పేర్కొంది. ఈమేరకు జూన్ 23న పరీక్ష నిర్వహించింది. జూన్ 30న ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ, జులై 1న ఫలితాలను ప్రకటించింది.
అమల్లోకి 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్..
దేశంలో వరుస పేపర్ లీకుల వ్యవహారం కేంద్రం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పేపరు లీకేజీలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకుగాను యుద్ధప్రాతిపదికన 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.