NEET UG 2024 Paper Leak: నీట్ యూజీ-2024 పేపర్ లీక్ వదంతులు, సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ ఇచ్చిన NTA
NEET UG: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టుల హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లీకేజీ వార్తలు ఫేక్ అంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టత ఇచ్చించింది.
NEET UG 2024 Paper Leak News: దేశంలోని వివిధ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా.. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టుల హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు రాజస్థాన్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు హిందీ మీడియానికి బదులుగా ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లీకేజీ వార్తలు ఫేక్ అంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టత ఇచ్చించింది.
ఎన్టీఏ క్లారిటీ..
విద్యార్థులకు నీట్ యూజీ ప్రశ్నపత్రాలను తప్పుగా ఇచ్చినట్లు పొరపాటు అంగీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రశ్నపత్రం లీకేజీ వార్తలను మాత్రం ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాదోపూర్, మ్యాన్‌టౌన్‌లోని ఆదర్శ్ విద్యామందిర్(బాలికల హయ్యర్ సెకండరీ) పరీక్ష కేంద్రంలో హిందీ మీడియానికి బదులుగా ఇంగ్లిష్ మీడియం ప్రశ్నపత్రాలను పొరపాటుగా ఇచ్చారని, ఇన్విజిలేటర్ వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నాడని.. అయినా కూడా విద్యార్థులు ప్రశ్నపత్రంతో పరీక్ష హాలు నుంచి బలవంతంగా బయటకు వచ్చినట్లు ఎన్టీఏ తెలిపింది. నిబంధనల ప్రకారం పరీక్ష సమయం ముగిసే వరకు ప్రశ్నపత్రాలతో బయటకు రావడం విరుద్ధం. అయితే ఆ విద్యార్థులు బలవంతంగా తమకిచ్చిన ప్రశ్నపత్రాలతో బయటకు వెళ్లారు. ఆ క్వశ్చన్ పేపర్‌ను సాయంత్రం 4 గంటలకు ఇంటర్నెట్‌లో పెట్టారని ఎన్టీఏ తెలిపింది. అప్పటికే దేశంలోని ఇతర పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంకావడంతో నీట్ యూజీ 2024 ప్రశ్నపత్రం లీకేజీకి ఆస్కారం లేదంటూ ఎన్టీఏ స్పష్టతనిచ్చింది.
National Testing Agency Ensures Fair Conduct of NEET (UG) 2024 Examination pic.twitter.com/Ay3SsLdZke
— National Testing Agency (@NTA_Exams) May 5, 2024
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 9న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఏప్రిల్ 9, 10 తేదీల్లో దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షల నిర్వహించారు. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో విద్యార్థులు హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్ష కోసం మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10 లక్షల బాలురు, 13 లక్షల బాలికలు ఉన్నారు. రీజియన్లవారీగా చూస్తే మొత్తం దరఖాస్తుల్లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్- 3,39,125 దరఖాస్తులు, ఆ తర్వాత మహారాష్ట్ర 2,79,904 దరఖాస్తులు, రాజస్థాన్ 1,96,139 దరఖాస్తులు అందాయి. ఇక దక్షిణాన తమిళనాడు నుంచి 1,55,216 దరఖాస్తులు, కర్నాటక 1,54,210 దరఖాస్తులు అందాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1.5 లక్షల మంది (ఏపీ 70 వేలు, తెలంగాణ 80 వేలు) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
నీట్ యూజీ పరీక్షలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలిటికల్ టూల్‌ను ఉపయోగించారు. ఇది విద్యార్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తిస్తుంది. నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.