CBSE Board Exams: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కీలక మార్పులు.. ఎప్పుడంటే?
CBSE Board Exams: నూతన జాతీయ విద్యావిధానం-2020 కు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం ప్రక్రియను మరింత సమగ్రంగా, నైపుణ్యం ఆధారితంగా, యోగ్యత ఆధారితంగా మార్పులు చేపట్టనున్నారు.
CBSE Board Exams: ఒకవైపు విద్యార్థులు సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు వచ్చే ఏడాది నిర్వహించబోయే పరీక్షల విధానంలో భారీ మార్పులు చేయాలని బోర్డు నిర్ణయించింది. నూతన జాతీయ విద్యావిధానం-2020 కు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం ప్రక్రియను మరింత సమగ్రంగా, నైపుణ్యం ఆధారితంగా, యోగ్యత ఆధారితంగా మార్పులు చేపట్టనున్నారు. ఈ కొత్త విధానంలో విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల ప్రతిభను సమగ్రంగా అంచనావేసే వెసులుబాటు ఉండనుంది. ఇప్పటికే ఈ విధానాన్ని చాలా పాఠశాలలు అనుసరిస్తున్నాయి. 2024 నుంచి అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్..
అసెస్‌మెంట్ అనేది ఏడాది మొత్తం సాగాల్సిన ప్రక్రియ, అంతేగాని విద్యాసంవత్సరం చివరలో నిర్వహించే 3 గంటల పరీక్షల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని నిర్ణయించలేము. ఇందులో భాగంగా అన్ని పేపర్లలో ప్రాక్టికల్స్‌కు స్వస్తి పలికి.. వాటి స్థానంలో 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ చేర్చాల్సిన అవసరం ఉంది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేయాలన్సి అవసరం ఉంది. దీనివల్ల విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంచనా వేయగలరు.
ప్రశ్నపత్రంలోనూ మార్పులు...
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల ప్రశ్నపత్రంలోనూ రెండు రకాల నిర్మాణాత్మక మార్పులు చేయనున్నారు. ఒకటి ప్రశ్నల సంఖ్యను పెంచడం, రెండోది ప్రశ్నల సరళిలో మార్పులు. విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లను అందించడానికి సీబీఎస్‌ఈ అంతర్గతంగా ప్రశ్నల సంఖ్యను 33% పెంచింది. దీనివల్ల విద్యార్థులు తమకు నచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసే వెసులుబాటు ఉండనుంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించేందుకు వీలుగా ప్రశ్నలు ఇక నుంచి నైపుణ్యం, సామర్థ్యాల ఆధారంగా ఉంటాయి.
3, 5, 8 తరగతుల విద్యార్థులకు కూడా..
విద్యార్థి యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని సాధించడమే లక్ష్యంగా 3, 5 మరియు 8 తరగతులలో విద్యార్థి యొక్క మూల్యాంకనంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. 3, 5 మరియు 8 తరగతుల విద్యార్థులపై మూల్యాంకన సర్వే చేస్తారు. ఈ పరీక్ష విద్యార్థులు మార్కులు సాధించే సాధారణ పరీక్షలా ఉండదు. ఈ పరీక్షల ద్వారా, వారి స్థాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంచనావేస్తారు. 3వ తరగతి విద్యార్థికి క్లాస్ 2లోని గణితం, సైన్స్ సబ్జెక్టుల గురించి అవగాహన ఉండదు. కాబట్టి, తదుపరి తరగతులలో వాటిని తగ్గించే లక్ష్యంతో అభ్యాస అంతరాలను పంచుకోవడం జరుగుతుంది.
విద్యార్థులకు మూల్యాంకన కార్డులు..
విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా అసెస్‌మెంట్(మూల్యాంకన) కార్డులను ప్రవేశపెట్టే యోచనలో సీబీఎస్‌ఈ ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. అసెస్‌మెంట్ కార్డ్ ద్వారా.. ఒక విద్యార్థి ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అంచనావేసే వీలుంటుంది. విద్యార్థి కూడా తనను తాను స్వీయ-అంచనా చేసుకుంటాడు. దీనిని విద్యార్థుల 360-డిగ్రీ మూల్యాంకనంగా పేర్కొనవచ్చు.
ఈ అన్నిరకాల మార్పులకు సంబంధించి సీబీఎస్ఈ ఇప్పటికే సంస్కరణలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేయనున్నారు. 2024 నుంచి అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు.